50వేలకు చేరువగా పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్క రోజే 199 మంది మృతి
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రెండో దశ లాక్‌డౌన్‌లో ఇచ్చిన మినహాయింపుల పుణ్యమో? లేదా మరేదైనా కారణమో? గడచిన 24 గంటల్లోనే దాదాపు 4వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో మహమ్మారి మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్కరోజే కొత్తగా 3,900 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలో 15వ స్థానానికి ఎగబాకింది. సోమవారంతో పోలిస్తే పాజిటివ్ కేసులు 9.04 శాతం పెరిగడం గమనార్హం. ఏప్రిల్ 20 తర్వాత పాజిటివ్ కేసులలో ఇదే గరిష్ఠ వృద్ధిరేటు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,142 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 1,693 మంది చనిపోయారు. అలాగే, గడచిన 24 గంటల్లో ఎన్నడూ లేని విధంగా 199 మంది కరోనాకు బలయ్యారు. సోమవారం కంటే ఇది 13.96 శాతం కంటే ఎక్కువ కాగా.. 3.24% ఉన్న మరణాల రేటు ఒక్కసారిగా 3.38%కి చేరిపోయింది. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య కూడా పెరగడం ఒకింత ఊరటనిచ్చే అంశం. వీరు సోమవారం నాటికి 27.45% ఉండగా మంగళవారానికి 28.17%కి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో దాదాపు 72% మహారాష్ట్ర (1,567), గుజరాత్ (376), ఢిల్లీ (349), తమిళనాడు (527)లలో నమోదయ్యాయి. నిన్న నమోదయిన 199 మొత్తం మరణాల్లో 50.51 శాతం పశ్చిమబెంగాల్‌లో (99 మంది) సంభవించడం ఆ రాష్ట్రంలో పరిస్థితుల తీవ్రతకు అద్దంపడుతోంది. తాజా సంఖ్యతో పశ్చిమ్ బెంగాల్‌లో కరోనా మరణాల శాతం 10.56 శాతానికి చేరింది. ఇది అన్ని రాష్ట్రాల కంటే, జాతీయ సగటుకంటే 3రెట్లు అధికం. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మరణాలు 4 శాతానికి పరిమితం కాగా, పశ్చిమబెంగాల్‌లో దీనికి రెట్టింపుగా ఉంది. గడచిన 24 గంటల్లో 296 కొత్త కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరి, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో కేసు, తెలంగాణలో 11 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. గోవా, మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు, లడఖ్‌ల్లో ఒక్క కేసుకూడా నమోదుకాలేదు. తాజాగా, కేరళలో నాలుగు రోజుల తర్వాత మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఏకంగా 508 కొత్త కేసులు నమోదు కాగా.. ఒక్క చెన్నైలోనే 290 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో తమిళనాడులో కేసుల సంఖ్య 4,058కి చేరింది. మంగళవారం నమోదైన కొత్త కేసుల్లో 3700 (95.53%) కేవలం పది రాష్ట్రాలలో నిర్ధారణ అయ్యాయి. దేశంలో వెయ్యికిపైగా కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య ఇప్పుడు 11కి చేరింది. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ కొత్తగా చేరింది. కేరళలో మొత్తం 503 కేసులు నమోదు కాగా.. వీరిలో 463 మంది కోలుకున్నారు. అంటే ఇక్కడ రికవరీ రేటు 92.4 శాతంగా ఉంది. ప్రస్తుతం అక్కడ కేవలం 38 మంది మాత్రమే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 15,525 కేసులు నమోదు కాగా, తర్వాత గుజరాత్ (6,245), ఢిల్లీ (5,104), తమిళనాడు (4,058), రాజస్థాన్ (3,158), ఉత్తరప్రదేశ్ (2,880), ఆంధ్రప్రదేశ్ (1,717), పంజాబ్ (1,451), పశ్చిమ్ బెంగాల్ (1,344), తెలంగాణ (1,096) ఉన్నాయి. తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. ముంబయి నగరంలో బాధితుల సంఖ్య 10వేలకు చేరువయ్యింది. మహారాష్ట్రలో 617 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ముంబైలోనే 387 ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
By May 06, 2020 at 07:46AM
No comments