Breaking News

ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలు దాటిన కేసులు.. బ్రెజిల్‌లో పంజా విసురుతోన్న కరోనా


వుహాన్ నగరంలో చిన్నగా మొదలైన కరోనా మమహ్మారి.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కొన్ని నెలలుగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోన్న కోవిడ్-19.. తనకు పేద, ధనిక దేశమనే భేద లేదంటోంది. అన్ని దేశాల్లోనూ వైరస్‌ ఉద్ధృతి కొనసాగిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకూ అమెరికా, ఐరోపా దేశాలను అల్లాడించిన ఈ వైరస్.. ప్రస్తుతం బ్రెజిల్‌లో పంజా విసురుతోంది. గడచిన నాలుగు రోజుల్లో 20వేల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లోనే 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 10,000 దాటాయి. బాధితుల సంఖ్య 1.46 లక్షలకు చేరింది. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ మొత్తం 40 లక్షల మంది వైరస్ బారినపడగా.. 2.76 లక్షల మంది బలయ్యారు. మరో 14 లక్షల మంది కోలుకోగా.. 23 లక్షల మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. రష్యాలో కొత్తగా 10 వేలకిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 1.87 లక్షలు దాటగా.. మరో 1,723 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, బ్రిటన్‌, రష్యాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బ్రిటన్‌లో తాజాగా 626 మంది మృతిచెందారు. అమెరికాలో మొత్తం 13.21 లక్షల మందికి వైరస్ సోకగా.. వీరిలో 78,615 మంది చనిపోయారు. బ్రిటన్‌లో 31,241 మంది, ఇటలీలో 30,201 మంది, స్పెయిన్‌లో 26,299 మంది, ఫ్రాన్స్‌లో 26,230 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఆంక్షలను సడలించడం వల్ల వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంక్షలను సడలించిన అనంతరం పలు దేశాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జర్మనీలో 170,588 మంది వైరస్ బారినపడగా.. 7,500 మంది చనిపోయారు. టర్కీలో 135,569 మంది, ఇరాన్‌లో 104,691 మంది, ఫ్రాన్స్‌లో 176,079 మంది, కెనడాలో 66,434 మంది, బెల్జియం 52,011 మంది, నెదర్లాండ్ 42,093 మంది వైరస్ బారినపడ్డారు. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం కొత్తగా 81 మందికి వ్యాధి సోకింది. దీంతో మొత్తం వ్యాధిగ్రస్థుల సంఖ్య 30,207కు చేరింది. ఇంతవరకు ఈ దేశంలో 1,526 మంది మరణించారు. అమెరికాలో కరోనా మరణాలు 78 వేలు దాటగా... న్యూయార్క్‌లోనే ఎక్కువమంది బలయ్యారు. ఈ నగరంలో ఇప్పటివరకు 26,581 మంది, న్యూజెర్సీలో 8,959 మంది, మస్సాచుసెట్స్‌లో 4,552 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో మరణాలు 30 వేలు దాటిపోయాయి. శుక్రవారం 243 మంది ఈ మహమ్మారి వల్ల బలయ్యారు. దీంతో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 30,201కు చేరింది. ఇటలీలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. అక్కడ భౌతిక దూరం, మాస్కుల నిబంధనలను అనేక మంది పట్టించుకోవడంలేదు.


By May 09, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/globally-more-than-4013896-are-infected-and-over-276400-have-died-due-to-coronavirus/articleshow/75640476.cms

No comments