సరిహద్దుల్లో చొరబాటుకు సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు.. కశ్మీర్‌లో మరో 240 మంది
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌లోని చొరబడేందుకు 300 మందికి పైగా ఉగ్రవాదులు వేచి ఉన్నారని జమ్మూ-కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మంగళవారం తెలిపారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి వారిని భారత్‌లోకి పంపేందుకు పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ వ్యూహాంలో భాగంగానే వారు అక్కడ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను ఎగదోసేందుకు పాకిస్థాన్ చేస్తున్న భారీ కుట్రలను తిప్పికొట్టడానికి భద్రత బలగాలను అప్రమత్తం చేశామని అన్నారు. ‘జమ్మూ కశ్మీర్‌లోకి పెద్ద సంఖ్యలో చొరబాటుకు ఉగ్రవాదులు వేచి చూస్తున్నారు.. ఇప్పటికే కశ్మీర్ లోయలో దాదాపు నాలుగు చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి.. రాజౌరీ-పూంచ్ సెక్టార్‌లో రెండు నుంచి మూడు చోట్ల ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నించారని’ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్బాగ్ సింగ్ అన్నారు. నియంత్రణ రేఖ వెంట శిబిరాల్లో పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ సహ ఇతర సంస్థలు యాక్టివ్‌గా ఉన్నాయని, శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘ఎల్ఓసీ వెంబడి కశ్మీర్‌వైపున 150 నుంచి 200 మంది, జమ్మూ రీజియన్‌లో 100 నుంచి 125 మంది ఉగ్రవాదులు ఉన్నట్టు తాజాగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్టు డీజీపీ వెల్లడించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి చొరబాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ సరిహద్దుల్లో రెండు నుంచి మూడు ఉగ్రవాద సమూహాలు చొరబాటుకు ప్రయత్నించారని, పాకిస్థాన్ ఇలాంటి దుష్ట ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని తెలిపారు. వీరి వల్ల ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ఇక, జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో 240 మందికిపైగా ఉగ్రవాదులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. ఈ ఏడాది ఆరంభంలో 270 మంది ఉగ్రవాదుల జాబితా ఉండేదని, పలు ఆపరేషన్‌లలో కొందర్ని హతమార్చడంతో ఈ సంఖ్య 240కి చేరిందన్నారు. మొత్తం 70కిపైగా ఉగ్రవాదుల హతమార్చగా.. వీరిలో 21 మంది వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన అగ్ర కమాండోలు ఉన్నారన్నారు.
By May 20, 2020 at 09:03AM
No comments