యూపీలో ఘోర ప్రమాదం.. 23 మంది వలసకూలీలు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఔరయా వద్ద రెండు ట్రక్కులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా అతివేగంతో వస్తున్న ఈ ట్రక్కులు అదుపుతప్పి ఢీకొట్టినట్టు భావిస్తున్నారు. ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. హాస్పిటల్‌లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా వలస కూలీలుగా గుర్తించారు. వీరంతా రాజస్థాన్ నుంచి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ఓ ట్రక్కులో వస్తుండగా.. ఔరయా నుంచి ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా వలస జీవులు పరాయి పంచన పస్తులుండలేక, సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడక పయనమవుతున్నాారు. ఈ క్రమంలో గమ్యం చేరేలోపే పలువురు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బీహార్ నుంచి ఐదుగురు స్కార్పియో వాహనంవలో కేరళలోని కోజికోడ్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వామనం డిచ్‌పల్లి మండలం నాక తండా వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కాలినడకన తమ ఇళ్లకు తిరిగి వెళుతున్న కార్మికులను రోడ్‌వేస్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. అదే రోజు మధ్యప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ గుణలో ఒక ట్రక్కు 8 మందికి పైగా కార్మికులను బలితీసుకుంది.
By May 16, 2020 at 07:08AM
No comments