దేశవ్యాప్తంగా 215 స్టేషన్‌లలో కోవిడ్ ఐసోలేషన్ కోచ్‌లు... గైడ్‌లైన్స్ విడుదల
రైల్వే కోచ్‌లను కోవిడ్ ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే శాఖ వీటిని దేశవ్యాప్తంగా 215 స్టేషన్‌లలో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. కరోనా అనుమానితులు, పాజిటివ్‌గా నిర్ధారణ అయి వైరస్ స్వల్పస్థాయిలో ఉన్నవారికి వీటిని కోవిడ్ కేర్ కేంద్రాలుగా వినియోగించనున్నారు. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్‌లలో వీటిని మోహరించినట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే, వీటిని ఉపయోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం మార్గదర్శకాలను జారీచేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ‘కోవిడ్-19 రైల్వే కోచ్‌లు - కోవిడ్ కేర్ సెంటర్‌లో అనుమానితులు, నిర్ధారణ అయి స్వల్ప లక్షణాలున్న వారికి చికిత్సకు వినియోగించబడతాయి. ఇక్కడ చికిత్స పొందుతున్నవారిలో ఎవరికైనా వైరస్ తీవ్రంగా ఉంటే హాస్పిటల్‌కు తరలిస్తారు. అనుమానితులు, నిర్ధారణ అయినవారికి వేర్వేరు కోచ్‌లను ఉపయోగిస్తారు.’ దేశంలోని కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలలో స్టేషన్‌లలో ఈ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. కేవలం రెడ్ జోన్ జిల్లాలే కాదు, గ్రీన్, ఆరెంజ్ జోన్‌లకు కూడా వీటిని అందుబాటులో ఉంచుతున్నట్టు కేంద్రం తెలిపింది. రైల్వే స్టేషన్‌లలో వీటిని ఉంచి, సమీపంలోని హాస్పిటల్‌తో అనుసంధానం చేస్తారు. ఢిల్లీ, ముంయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా సహా అన్ని ప్రధాన నగరాలు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, పశ్చిమ్ బెంగాల్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్, త్రిపుర, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్‌లలో ఉంచినట్టు తెలిపింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 27, తర్వాత మహారాష్ట్ర (21), పశ్చిమ్ బెంగాల్ (18),బీహార్ (15), మధ్యప్రదేశ్ (14), అసోం (13) ఉన్నాయి. మొత్తం 215 స్టేషన్‌లో అందుబాటులో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లలో 85 చోట్ల రైల్వే హాస్పిటల్స్‌లోని వైద్య సిబ్బంది సేవలు అందజేస్తారు. మిగతా 130 స్టేషన్‌లకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే వైద్య సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తేనే కోచ్‌లను అందుబాటులో ఉంచుతారు. వీటిలో చికిత్స పొందే బాధితులకు ఆహారం, ఆక్సిజన్ సహా ఇతర సౌకర్యాలను రైల్వే శాఖ కల్పించనుంది. మొత్తం 5,150 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా రైల్వే శాఖ మార్చింది. ఇందులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది.
By May 07, 2020 at 10:44AM
No comments