Breaking News

అణు విద్యుత్ ప్లాంట్ కూల్చేసిన జర్మనీ.. 2022 నాటికి పూర్తిగా మూత


అణు విద్యుత్తు కేంద్రంలోని కూలింగ్‌ టవర్లను కూల్చివేసింది. ఫిలిప్స్‌బర్గ్ అణువిద్యుత్తు కేంద్రంలోని 500 అడుగుల ఎత్తైన రెండు టవర్లు కూల్చివేసినట్టు తెలిపింది. ఈ కర్మాగారంలో ఒక రియాక్టర్‌ను 2011లో, మరోదాన్ని డిసెంబరు 2019లో మూసివేశారు. ఫలితంగా పరిశ్రమ మొత్తం మూతపడింది. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ రెండు కూలింగ్‌ టవర్లను పూర్తి నియంత్రిత విధానంతో నేలమట్టం చేసినట్లు అక్కడి ఇంజినీర్లు తెలిపారు. కరోనా వైరస్ కట్టిడికి ఆంక్షల విధించడంతో కూల్చివేసిన సమయాన్ని వెల్లడించలేదు. టవర్లు కూల్చివేస్తున్న విషయం ముందే తెలియజేస్తే ప్రజలు భారీ సంఖ్యలో వస్తారని, దీని ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు సమాచారం బయటకు రానివ్వలేదని వివరించారు. అణు విద్యుత్తును పూర్తిగా పక్కనబెట్టాలని నిర్ణయించిన జర్మనీ 2022 నాటికి మొత్తం అణు విద్యుత్తు కేంద్రాలను మూసివేయాలని ఇది వరకు నిర్ణయించింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలని భావిస్తోన్న జర్మనీ.. ఇదే సమయంలో అణు విద్యుత్తును పూర్తిగా వదిలేయాలని నిర్ణయించింది. 2000 నాటికి జర్మనీ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్తు వాటా 29.5 శాతం ఉండగా.. 2016 నాటికి అది 13 శాతానికి తగ్గింది. 2022 నాటికి పూర్తిగా ఈ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయనుంది. ఈ లోటును పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తితో భర్తీచేయనుంది. జపాన్‌లోని పుకుషిమా దైచీ అణు రియాక్టర్ ప్రమాదం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. అయితే, 1970లో న్యూక్లియర్ పవర్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు, న్యాయస్థానాల్లోనూ కేసులు దాఖలయ్యాయి. 1975లో జర్మనీ దక్షిణ ప్రాంతంలోని బడెన్-ఉర్టెమ్‌బర్గ్ రాష్ట్రం వైల్ వద్ద ప్లాంట్‌ నిర్మాణాన్ని అడ్డుకోడానికి 28,000 మంది ర్యాలీగా వెళ్లారు. ఇది జరిగిన కొన్నాళ్లకు 1979లో అమెరికాలో త్రిమైల్ ఐల్యాండ్‌లో అణు ప్రమాదం జరగడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. దాదాపు 20వేల మంది వీధుల్లోకి వచ్చి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ఆతర్వాత రష్యాలోని చెర్నోబిల్ అణు ప్రమాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో జర్మనీ 1989 తర్వాత కొత్త ప్లాంట్ నిర్మాణాలు నిలిపివేసింది. అయినా ప్రజలు మాత్రం ఉద్యమాన్ని ఆపలేదు. ఇక, 1998లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశలవారిగా అణు విద్యుత్‌ కేంద్రాలను మూసివేస్తామని, ఈ ప్లాంట్‌ల కాలపరమితి 32 ఏళ్లకు మించకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీనిపై అప్పుడు తుది గడువు విధించలేదు. తొలిసారి 2003లో ఒకటి, 2005లో ఇంకొకటి మూసివేశారు.


By May 17, 2020 at 01:10PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/germany-demolished-nuclear-plant-cooling-towers-spectacular-implosion/articleshow/75785897.cms

No comments