Breaking News

భవిష్యత్తులో కరోనా వ్యాక్సిన్‌కు హబ్‌గా భారత్.. దేశవ్యాప్తంగా 14 ప్రాజెక్టులు


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. భారత్ సైతం ఆ దిశగా ముందుకు సాగుతోంది. ఇక, మొత్తం 150 దేశాలకు వివిధ రకాల ఔషధాలు, వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తున్న భారత్ ప్రపంచ వ్యాక్సిన్‌ల హబ్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ను అభివృద్ధిపై కూడా భారత్ దృష్టిసారించింది. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన మొత్తం 14 ప్రాజెక్టులను ప్రయివేట్ కంపెనీలు, విద్యా సంస్థలతో కలిసి ప్రారంభించింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ముమ్మరంగా పరిశోధనలు సాగుతుండగా.. ఇందులో ఒకటి క్లినికల్ ట్రయల్స్ దశకు చేరింది... మరో నాలుగు అడ్వాన్స్‌డ్ దశలో ఉన్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ధ్రువీకరించాయి. దేశవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్‌ల తయారీ ప్రోగ్రామ్ కోసం పీఎంకేర్స్ ద్వారా రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే, మొత్తం 14 ప్రాజెక్టులకు పీఎంకేర్స్ నిధులు అందుతాయని డీబీటీ, డీఎస్టీ మాత్రం ధ్రువీకరించలేదు. వ్యాక్సిన్ తయారీ ప్రాజెక్టుల స్క్రీనింగ్ దశ ఇప్పటికే పూర్తయిందని, పీఎంకేర్స్ నుంచి లేదా ఇతర పథకాలు ద్వారా నిధులు సమకూరుతాయో తమకు తెలియదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుల్లో ఏడు రెండు నగరాల్లోనే మొదలయ్యాయి. పుణే (మహారాష్ట్ర)లో నాలుగు, హైదరాబాద్‌ (తెలంగాణ)లో మూడు, అహ్మదాబాద్ (గుజరాత్), వెల్లూరు (తమిళనాడు), ఢిల్లీ, ఇండోర్ (మధ్యప్రదేశ్), తిరువనంతపురం (కేరళ), మొహాలీ (పంజాబ్) ఒక్కొక్కటి ఉన్నాయి. ‘వివిధ దేశాలు, సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో సహా మొత్తం 30 వ్యాక్సిన్‌ ప్రోగ్రామ్స్ పురోగతిలో ఉన్నాయి.. ప్రస్తుతం కనీసం ఆరు కంపెనీలు వ్యాక్సిన్‌పై పరిశోధన చేస్తున్నాయి.. పలు విద్యా, పరిశోధన సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.. వీటిలో కనీసం 10 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నాం’ అని డీబీటీ కార్యదర్శి రేను స్వరూప్ అన్నారు. ఇంటర్ నాసల్ వ్యాక్సిన్ నుంచి క్లోనింగ్, సంయోగం ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ సార్స్-కోవ్2 స్పైక్ ప్రోటీన్, డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీ వరకు ఈ ప్రాజెక్టులకు ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. ఇందులో పదింటికి డీబీటీ, డీఎస్టీ నిధులు అందజేస్తున్నాయి. పుణే, ఐఐఎస్ఈఆర్- మొహాలీ, తిరువనంతపురం, నిట్-ఢిల్లీలో ప్రాజెక్టులకు నిధులు అందజేస్తున్నట్టు డీఎస్టీ సెక్రెటరీ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.


By May 16, 2020 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-14-projects-in-8-states-lead-indias-vaccine-hunt/articleshow/75772374.cms

No comments