భారత్‌లో కరోనా: పాజిటివ్ కేసుల్లో ఇరాన్‌ను దాటేసి.. ప్రపంచంలో 10 స్థానానికి
ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఇరాన్‌ను దాటేసి 10వ స్థానానికి చేరింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కొత్త కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును 282 కేసులు నిర్ధారణ అవుతున్నాయి. పాజిటివ్ కేసుల వరుసగా నాలుగు రోజు 6వేలు దాటడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనాతో మరో 153 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాలు 4,053కి చేరాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 138,536 చేరగా.. వీరిలో ఇప్పటి వరకూ 57,692 మంది కోలుకున్నారు. మరో 76,811 మందికి చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో రోజు రోజుకూ కొత్త రికార్డులు బద్ధలవుతున్నాయి. ఆదివారం ఏకంగా 3,041 కొత్త కేసులు నమోదుకాగా.. ముంబయిలో అత్యధికంగా 1,725 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 50వేల మార్క్ దాటింది. ఒక్క ముంబయిలోనే 30వేల కేసులు నమోదుకావడం గమనార్హం. బెంగాల్‌లోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ గడచిన 24 గంటల్లో 208 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,667కి ఎగబాకింది. మే 10 తర్వాత ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆదివారం దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే పాజిటివ్ కేసులు కొంచెం తక్కువగానే నమోదయ్యాయి. తమిళనాడులో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసుల నమోదు 700 దాటింది. అయితే, మే 1 తర్వాత తమిళనాడులో కోలుకున్నవారి సంఖ్య తగ్గడం సానుకూలం. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 16,200 దాటగా.. ఒక్క చైన్నై నగరంలోనే పాజిటివ్ కేసులు 10వేలు దాటింది. గుజరాత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 14వేల మార్క్ దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత అత్యధిక కేసులు ఇక్కడే నమోదయ్యాయి. మరణాల్లో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 858 మంది కరోనాతో చనిపోయారు. ఇక్కడ మరణాల రేటు 6.1 శాతంగా నమోదయ్యింది. ఢిల్లీలో ఆదివారం కొత్తగా 508 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒక్క రోజు సంభవించడం ఇదే తొలిసారి. వలస కార్మికుల రాకతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లో 286, ఉత్తరప్రదేశ్ 254, మధ్యప్రదేశ్ 219, బీహార్ 180, ఒడిశాలో 66 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒడిశాలోని ఇప్పటి వరకూ కరోనా వైరస్ కేసు నమోదుకాని బారిగఢ్ జిల్లాల్లో తొలిసారి ఓ కేసు నమోదయ్యింది.
By May 25, 2020 at 09:27AM
No comments