Breaking News

బెంగాల్‌లో అంపన్ బీభత్సం: గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడని నష్టం.. నేడు ప్రధాని పర్యటన


కారణంగా అతలాకుతలమయిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పర్యటించనున్నారు. ముందుగా బెంగాల్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 10.45 గంటలకు సీఎం మమతతో కలిసి ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మోదీ సమావేశమై తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. పశ్చిమ్ బెంగాల్ సీఎం అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన మోదీ.. ఆ రాష్ట్రానికి అన్నివిధాల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుఫాను పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హథియా దీవుల మధ్య బుధవారం సాయంత్రం తీరం దాటిన విషయం తెలిసిందే. తీరం దాటే సమయంలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. తుఫాను తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది చనిపోయారు. ఒడిశాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. కోల్‌కతా నగరం గత 100ఏళ్లలో ఎన్నడూ చూడని నష్టాన్ని చవిచూసింది. అంపన్ దెబ్బకు ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయి, ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. పశ్చిమ్ బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో తొమ్మిది గంటల పాటు తుఫాను బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, ఇళ్లు కూలిపోయాయి. కోల్‌కతా విమానాశ్రయం వాననీటితో నిండిపోయింది. నగరంలోని పలు వీధుల్లో మృతదేహాలు నీటిపై తెలాడాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు నెలమట్టం కాగా.. అనేక గ్రామాలు నీటమునిగాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహించి పంట పొలాలను ముంచెత్తాయి. పదకొండేళ్ల కిందట ఐలా తుఫాను సృష్టించిన విధ్వంసాన్ని మించిన భారీ నష్టం పశ్చిమ్ బెంగాల్‌కు వాటిళ్లింది. ఉత్తర పరగణాల జిల్లాలో 27 మంది మృతిచెందగా.. 188,000 హెకార్ట్‌లలో పంట నీటి మునింగింది. తుఫాను సమయంలో సచివాలయం నుంచి పరిస్థితులను గమనించిన సీఎం మమతా బెనర్జీ.. భయాన అనుభవం తన కళ్లముందు కదలాడిందన్నారు. ‘నేను 14 వ అంతస్తులోని నా ఛాంబర్‌లోకి వెళ్ళినప్పుడు అది వణుకుతున్నట్లు అనిపించింది. భవంతిలోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి’ అని ఆమె అన్నారు. ఇలాంటి విపత్తును బెంగాల్‌ గతంలో చూడలేదని వ్యాఖ్యానించారు. తుఫాను దెబ్బకు కోల్‌కతాలోని పురాతన చర్చి కూలిపోయింది. వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 205 ఏళ్ల నాటి పురాతన సెయింట్ ఆండ్రూ చర్చి.. రెండు ప్రపంచ యుద్ధాలు, దేశ విభజన, అనేక దాడుల సమయంలోనూ సురక్షితంగా ఉంది.. కానీ, అంపన్ కారణంగా ఈ వారస్వత కట్టడం కూలిపోయింది. తుఫాను తక్షణ నిధుల కింద బెంగాల్ ప్రభుత్వం రూ.1,000 కోట్ల విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారంగా సీఎం మమత ప్రకటించారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలతో తాను మాట్లాడానని, అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. పశ్చిమబెంగాల్, ఒడిశాలో కేంద్ర హోంశాఖ అధికారులు పర్యటిస్తారని ఎన్‌డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్ తెలిపారు. ఒడిశాలోనూ ప్రధాని ఏరియల్ సర్వే చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘ఉమ్‌పున్’ తుఫాన్‌గా మారి ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. కాగా, బెంగాల్‌లో ఈ తుఫాన్ కారణంగా ఏకంగా 72 మంది మృత్యువాతపడ్డారు.


By May 22, 2020 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amphan-cyclone-march-through-west-bengal-and-72-killed-pm-modi-to-visit-today/articleshow/75881179.cms

No comments