Breaking News

కరోనా చికిత్సలో సంజీవనిగా భావిస్తోన్న ఆ ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్... ఎఫ్‌డీఏ హెచ్చరిక


కరోనా వైరస్‌ రోగులకు చికిత్సలో సంజీవనిగా భావిస్తున్న మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్ వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌() హెచ్చరించింది. దీని వల్ల తీవ్రమైన హృదయ సంబంధిత సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ పరిణామాల గురించి ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే పొందుపరిచి ఉందని గుర్తుచేసింది. అయితే, బాధితుడి రోగి పరిస్థితిని ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. ఈ దుష్ప్రభావాన్ని తగ్గించొచ్చని సూచించింది. సోకిన బాధితులకు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలో హాస్పిటల్‌లోని వైద్య సిబ్బందే నిర్ణయం తీసుకోవాలని వివరించింది. మలేరియాతో సహా లూపస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు మందులు తీసుకునే రోగులు, సూచించిన విధంగానే వాటిని కొనసాగించాలని తెలిపింది. క్యూటీ ఇంటర్వెల్ ప్రొగలాంగేషన్, హృదయ స్పందన రేటు పెరిగి వెంట్రిక్యులర్ టాచీకార్డియాకు దారితీస్తుందని హెచ్చరించింది. కరోనా వైరస్‌పై పోరాడే సమర్థమైన వ్యాక్సిన్ తయారీకి పరిశోధనలు జరుగుతున్నాయని.. అప్పటి వరకు ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకొనే చికిత్స అందజేయాలని ఎఫ్‌డీఏ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని వాడేందుకు అనుమతి ఇచ్చామని పేర్కొంది. కరోనాతో హాస్పిటల్‌లో చేరి పరిస్థితులు విషమించిన రోగులకు మాత్రమే వైద్యుల సూచన మేరకు వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ డ్రగ్‌ వాడకానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను వైద్యులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బాధితులకు చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటు భారత్‌లోనూ అత్యవసర పరిస్థితుల్లో రోగికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఈ ఔషధాన్ని ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సూచించింది. అయితే, దీని వల్ల కొవిడ్‌-19 నయమవుతుందన్న అధికారిక ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు లేవు. కరోనా వైరస్‌ను తుదముట్టించే సామర్థ్యం వీటికి ఉందో లేదో ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో ఔషధం వాడిని దాదాపు 24 మంది కరోనా బాధితులకు అమాంతం హృదయ స్పందన రేటు పెరిగిపోయి, ప్రాణాలు కోల్పోయారని ఓ అధ్యయనం తెలిపింది. క్లోరోక్విన్ వల్ల కండరాల బలహీనత, గుండెలో రక్తప్రసరణ లోపం లాంటి దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయి. ఫ్రాన్స్‌లో 36 కోవిడ్ -19 రోగులపై నిర్వహించిన అధ్యయనంలో క్లోరోక్విన్ వాడకం వల్ల సానుకూల ఫలితాలు వచ్చినట్టు తేలింది. దీంతో ఈ ఔషధానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.


By April 25, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/fda-warns-on-malaria-drug-hydroxychloroquine-after-deaths-and-poisonings-reported-in-coronavirus/articleshow/75370784.cms

No comments