Breaking News

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం


కశ్మీర్‌లో బుధవారం ఉదయం ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. దక్షిణ కశ్మీర్‌ సోఫియాన్ జిల్లా మెల్‌హెరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం రాత్రి అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ముష్కరులు సైన్యంపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమయిన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వీరంతా అన్సర్ ఘజావత్ ఉల్ హింద్ తీవ్రవాద సంస్థకు చెందినవారు. ఎన్‌కౌంటర్‌లో ఆ సంస్థ టాప్ కమాండర్ కూడా హతమయ్యాడు. ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచే ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా.. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. సైన్యం ముందు హెచ్చరికలకు సూచనగా కాల్పులు జరిపిందని తెలిపారు. అనంతరం ఉగ్రవాదుల అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి, సైన్యంపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు. శనివారం బారాముల్లా జిల్లా సోపోర్‌ సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అహాగ్‌బాబ్ క్రాసింగ్ సమీపంలో ఉన్న నూర్బాగ్ వద్ద సీఆర్‌పీఎఫ్‌, పోలీసులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోపోర్ పట్టణంలో విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారని స్థానిక ఎస్పీ తెలిపారు.


By April 22, 2020 at 11:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-militants-killed-in-encounter-at-shopian-district-in-kashmir/articleshow/75286796.cms

No comments