కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందా?

⍟ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించి, ప్రజలను గడప దాటి రాకుండా చేశాయి. ప్రపంచంలోని 200పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్.. అగ్రరాజ్యాల నుంచి పసికూనలను సైతం గడగడలాడిస్తోంది. ⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 400 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూసిన తర్వాత మంగళవారం నాడు అత్యధికంగా 300పైగా కేసులు నమోదు కాగా.. బుధవారం ఆ సంఖ్యకు మించి నిర్ధారణ అయ్యాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే స్థాయిని దాటి సామాజిక వ్యాప్తి మొదలైందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ⍟ ఏపీలో మరో 24 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 111కు చేరింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ల్యాబ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ⍟ తెలంగాణలో బుధవారం ఒక్క రోజే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, యశోదలో ఒకరు చనిపోయారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య రాష్ట్రంలో 9కి చేరింది. ముందుగా వెల్లడించిన మీడియా బులెటిన్ ప్రకారం.. 12 మందికి కరోనా సోకిందని.. ఒకరు మరణించారని తెలిపారు. ⍟ ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో తొలి కరోనా మరణం సంభవించింది. 56 ఏళ్ల వ్యక్తి కోవిడ్ బారిన ప్రాణాలు కోల్పోయాడు. సియాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం అతడు చనిపోగా.. అంతకు ముందే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జ్వరం రావడంతో అతడు మార్చి 23న స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరకు చెకప్ కోసం వెళ్లాడు. ⍟ కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ఒకే ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్ అందించే వినూత్నమైన పరికరాన్ని విశాఖ నావల్ డాక్‌యార్డ్ సిద్ధం చేసింది. ⍟ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి వ్యవహారాన్ని మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమించబోమని తేల్చి చెప్పారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ⍟ ఉబ్బసం, అలర్జీ కీళ్ల నొప్పులతో బాధపడుతూ... గ్లూకోకోర్టికోయిడ్ రకం స్టిరాయిడ్ హార్మోన్లను ఔషధాలుగా తీసుకునేవారికి కరోనాతో ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మందులు సహజంగానే రోగనిరోధక శక్తిని కొంతమేర దెబ్బతీస్తాయి. ఒకవేళ ఇలాంటి వారికి వైరస్ సోకితే... వారిలో స్టిరాయిడ్ పనితీరు మందగించి, ఆయా వ్యాధుల తీవ్రత పెరిగే పరిస్థితి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
By April 02, 2020 at 08:59AM
No comments