దేశంలోని 30 శాతం కేసులకు తబ్లీగ్‌తో లింక్.. తెలంగాలో 79 %, ఏపీలో 61 శాతం
దేశంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం పాజిటివ్ కేసుల్లో 30 శాతం తబ్లీగ్ జమాత్ మతసమ్మేళనంతో సంబంధం ఉన్నవేనని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడానికి కార్యక్రమం దోహదం చేసిందని తెలిపింది. మొత్తం 14,378 కేసుల్లో 4,191 మంది తబ్లీగ్ జమాత్‌కు హాజరైనవారు.. వారి కుటుంబసభ్యులేనని పేర్కొంది. దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారు ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇందులో తమిళనాడు 80 శాతం, ఢిల్లీ 60 శాతం, తెలంగాణలొ 79, ఆంధ్రప్రదేశ్‌లో 61, ఉత్తరప్రదేశ్‌లో 59 శాతం కేసులకు తబ్లీగ్ జమాత్‌లో లింక్ ఉందని పేర్కొంది. దేశంలో గత మూడు వారాల్లో కరోనా సగటు వృద్ధిరేటు తగ్గుముఖం పడుతోందని వెల్లడించింది. మొదట రెండంకెల్లో సాగిన వృద్ధి రేటు గత మూడురోజులుగా ఒక్క అంకెకు (7.42%) పరిమితమైంది. ముఖ్యంగా గత మూడురోజుల్లో ఇది వరసగా 6.92%, 8.43%, 6.91%గా నమోదైంది. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మూడు వారాల్లో 9.37 నుంచి 13.62 శాతానికి పెరిగింది. 21 రోజుల కిందట ప్రతి 10.66 మందిలో ఒకరు కోలుకోగా ఇప్పుడు ప్రతి 7.3 మందిలో ఒకరు కోవిడ్ నుంచి బయపడుతున్నారు. ఇదే సమయంలో మరణాల నిష్పత్తి మాత్రం 2.63 నుంచి 3.29 శాతానికి పెరిగింది. 21 రోజుల కిందట సగటున 38 మందిలో ఒకరు మృత్యువాత పడగా, ఇప్పుడు ప్రతి 30 మందిలో ఒకరు చనిపోతున్నారు. పాజిటివ్ కేసుల వృద్ధి తగ్గుముఖం పట్టడం, కోలుకున్నవారి నిష్పత్తి పెరుగుతుండటం సానుకూలాంశం. కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారిలో 60ఏళ్లుపైబడిన వ్యక్తులు 75.3 శాతంగా ఉందని, వీరిలో 83 శాతం మందికి ఇంతకు ముందే అనారోగ్య కారణాలు ఉన్నట్టు తెలిపింది. కరోనా వైరస్ మృతుల్లో 45 ఏళ్లలోపు వారు 14.4 శాతం, 45 నుంచి 60 ఏళ్లలోపు 10.3 శాతం, 60 నుంచి 75 ఏళ్లలోపు 33.1 శాతం, 75 ఏళ్లు దాటినవారు 42.2 శాతం ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 15వేలు దాటగా.. మృతుల సంఖ్య 500 దాటేసింది. శనివారం అత్యధికంగా 1,266 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.
By April 19, 2020 at 10:29AM
No comments