Breaking News

2 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. అమెరికాలో మళ్లీ విజృంభణ


ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి స్వైరవిహారం కొనసాగుతోంది. ఈ రాకాసి కోరల్లో చిక్కుకుని దాదాపు అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. దీనికి అంతం ఎక్కడో తెలియక సతమతమవుతున్నారు. అమెరికాలో రెండు రోజుల కిందట కాస్త తగ్గినట్లే కనిపించిన మళ్లీ ఉద్ధృతి పెరిగింది. గడచిన 24 గంటల్లోనే ఈ మహమ్మారి అమెరికాలో 3,172 మందిని బలి తీసుకుంది. అంతకు ముందు రోజు కేవలం 1,738 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటి వరకూ అగ్రరాజ్యంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 52 వేలు దాటింది. శుక్రవారం కొత్తగా మరో 35వేల మందికిపైగా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అమెరికాలో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 9.25 లక్షలు దాటింది. స్పెయిన్‌లో గత 24 గంటల్లో మరో 367 మంది ప్రాణాలు కోల్పోగా.. మార్చి 22 తర్వాత అక్కడ ఒక్క రోజు మరణాల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 22,524కు పెరిగింది. స్పెయిన్‌లోనూ కరోనా బాధితుల సంఖ్య 2.20 లక్షలకు చేరువలో ఉంది. ఇక, ఇటలీలోనూ శుక్రవారం మరో 450 మంది మృతిచెందారు. దీంతో ఇటలీలో మొత్తం మరణాలు 255,969కి చేరాయి. అలాగే కొత్తగా 4,600 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. కరోనా కేసుల సంఖ్య 192,994కి చేరుకుంది. ఇటలీలో కొత్తగా నమోదైన కేసుల్లో కనీసం 44 శాతం నర్సింగ్‌ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో వెలుగుచూసినవేనని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 28.30 లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా.. వీరిలో లక్షా 97వేల మందికిపైగా చనిపోయారు. దాదాపు ఎనిమిది లక్షల మంది కోలుకోగా.. ఇంకా దాదాపు 18.34 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 58వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. చైనాలో శుక్రవారం కరోనా కొత్త కేసులు కేవలం ఆరు నమోదయ్యాయి. వుహాన్‌లోగానీ, హుబెయ్‌ ప్రావిన్సులోగానీ కొద్దిరోజులుగా ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు. ఐరోపాలోని ఫ్రాన్స్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. శుక్రవారం మరో 450 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో అక్కడ కరోనా వైరస్ మరణాలు 22,245కి చేరుకున్నాయి. బాధితుల సంఖ్య కూడా 1.60 లక్షలకు చేరింది. బ్రిటన్‌లో మరో 600 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 19,500 దాటాయి. పాజిటివ్ కేసులు కూడా 143,464గా నమోదయ్యింది. జర్మనీలో కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్నా మరణాలు మాత్రం అదుపులో ఉన్నాయి. బాధితుల సంఖ్య 154,999కి చేరుకుంటే... 5,760 మంది బలయ్యారు. బెల్జియంలో 6,679 మంది కరోనా కాటుకు బలయ్యారు. బెల్జియంలో 44,293 మంది వైరస్ బారినపడ్డారు. ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 88వేలు దాటగా.. 5,571 మంది చనిపోయారు. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో కోవిడ్ కేసులు 53వేలకు చేరింది. రష్యాలోనూ మమహ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అక్కడ 68వేలకుపైగా కేసులు నిర్ధారణ కాగా.. మరణాల సంఖ్య మాత్రం 615గా ఉంది. నెదర్లాండ్‌లో 36,535 మంది వైరస్ బారినపడగా.. 4,200 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో 43,888 వేల కేసులు.. 2,307 మరణాలు, స్విట్జర్లాండ్‌లో 28,677 కేసులు.. 1549 మరణాలు, స్వీడన్‌లో 2152మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరాన్ని చైనాలోని వుహాన్‌తో ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెత్తిన్‌ కొకా పోల్చారు. టర్కీలో ఇప్పటివరకు 1.04 లక్షల కేసులు నమోదు కాగా.. దాదాపు 2,600 మంది మృతిచెందారు. వాటిలో అత్యధికం ఇస్తాంబుల్‌లోనే చోటుచేసుకున్నాయి. ఆఫ్రికా దేశాల్లో వైద్య సామగ్రి కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆయా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 25 వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగితే.. అధిక సంఖ్యలో బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన సదుపాయాలు ఆ దేశాల్లో లేవని నిపుణులు చెబుతున్నారు. 10 దేశాల్లో ఒక్క వెంటిలేటర్‌ కూడా లేదని గుర్తుచేస్తున్నారు.


By April 25, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/globally-more-than-2830000-are-infected-and-over-197200-have-died-due-to-coronavirus/articleshow/75368507.cms

No comments