ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మందికి వైరస్ .. అమెరికాలో 50వేలు దాటిన మృతులు
కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అటు ఐరోపా దేశాల్లోనూ పరిస్థితి కుదుటపడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా వైరస్ సోకతున్నవారి సంఖ్య కూడా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 27లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా.. వీరిలో లక్షా 91వేల మంది చనిపోయారు. మరో ఏడున్నర లక్షల మంది కోలుకోగా.. ఇంకా దాదాపు 18 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 59వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో 1,738 మంది మృత్యువాతపడ్డారు. అంతకుముందు 24 గంటల్లో 2,500కుపైగా మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆయా రాష్ట్రాలు శ్రీకారం చుడుతున్నాయి. ఆంక్షలను సడలించి వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాాళ్లూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేసిన ట్రంప్ ప్రభుత్వం.. తిరిగి సాధారణ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రస్తుతం వారిని కోరుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 8.8 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 50 వేలు దాటింది. బ్రిటన్‌లో కొవిడ్ బారిన పడి ఇప్పటివరకు 492 మంది భారత సంతతి వ్యక్తులు మరణించినట్లు ఆస్పత్రులు విడుదల చేసిన తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. గురువారం బ్రిటన్‌లో మరో 616 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 18,738కి పెరిగింది. భారత్‌కు చెందిన 46 ఏళ్ల కార్మికుడు కరోనాతో బాధపడుతూ సింగపూర్‌లోని ఓ ఆసుపత్రి మెట్ల వద్ద మృతిచెందాడు. స్థానిక పోలీసులు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జన సంచారంపై నిషేధాజ్ఞలను మే 22 వరకు పొడిగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రకటించింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఆ దేశం.. రంజాన్ మాసానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. చైనాలో కొవిడ్ లక్షణాలేవీ కనిపించనప్పటికీ పాజిటివ్‌గా తేలుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఇలాంటి కేసులు 27 నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల సంఖ్య 984కు పెరిగింది. ఐరోపాలోని ఇటలీలో 24,549, స్పెయిన్‌లో 22,157, ఫ్రాన్స్‌లో 21,856, బెల్జియంలో 6,490, జర్మనీలో 5,575 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. స్పెయిన్‌లో 213,024, ఇటలీలో 189,973, ఫ్రాన్స్‌లో 158,183, జర్మనీలో 153,129, బ్రిటన్ 138,078, టర్కీలో 101,790, బెల్జియం 42,979 మంది వైరస్ బారినపడ్డారు. ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 87వేలు దాటగా.. 5,481 మంది చనిపోయారు. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో కోవిడ్ కేసులు 50వేలు దాటాయి. రష్యాలోనూ మమహ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అక్కడ 62వేలకుపైగా కేసులు నిర్ధారణ కాగా.. మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. కరోనాకు దెబ్బకు చిగురుటాకులా వణికి ఇటలీలో గురువారం మరో 4 వేల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నెదర్లాండ్‌లో 35వేల మంది వైరస్ బారినపడగా.. నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో 42వేల కేసులు.. 2,147 మరణాలు, స్విట్జర్లాండ్‌లో 1549 మంది, స్వీడన్‌లో 2,000 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
By April 24, 2020 at 09:09AM
No comments