Breaking News

రైల్వే ఆధ్వర్యంలో 2.6 లక్షల మాస్క్‌లు, 25వేల లీటర్ల శానిటైజర్ తయారీ


దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చితే బాధితులకు చికిత్స అందజేయడానికి ప్రస్తుతం ఉన్న హాస్పిటల్స్ సరిపోవు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రైల్వే కోచ్‌లనే ఐసోలేషణ్ వార్డులుగా మార్చుతున్నారు. మొత్తం 3.6 లక్షల ఐసోలేషన్ వార్డులను రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించటానికి వీలుగా యుద్ధ ప్రాతిపదికన ఇవి రూపుదిద్దుకున్నాయి. ఇదిలా ఉండగా, మాస్క్‌లు, శానిటైజర్ల కూడా రైల్వే శాఖ తయారు చేయనుంది. 2.6 లక్షల మాస్కులతోపాటు 25 వేల లీటర్ల శానిటైజర్‌ను తయారుచేయడానికి సిద్ధమైంది. ఐసోలేషన్ వార్డును ఉపయోగించే ముందు, తరువాత కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయనున్నారు. రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినందున అందులో సేవలు అందజేసే సిబ్బందికి, బాధితులకు వీటిని ఉపయోగించనున్నారు. ఒక కోచ్‌కు 9 క్యాబిన్లు అంటే ఒక్కో కోచ్‌లో 18 మంది రోగులకు చికిత్స అందజేయవచ్చు. రోగుల కోసం ఐసోలేషన్‌ కోచ్‌లలో అనేక సదుపాయాలను కల్పించారు. కోచ్‌లోని ప్రతి క్యాబిన్‌లో బెర్తుల పక్కనే రెండు ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేశారు. క్యాబిన్‌ మూసివేసేందుకు వీలుగా ప్లాస్టిక్‌ షీట్లను ఉపయోగించారు. ప్రతి కోచ్‌కూ నాలుగు మరుగుదొడ్లు ఉంటాయి. మరుగుదొడ్లలో నేల మెత్తగా ఉండటానికి పీవీసీ మెటీరియల్‌తో కూడిన షీట్‌ను వేయించారు. బాత్‌రూమ్‌ల్లో బకెట్‌, మగ్గు, సోప్‌ ఉంచారు. ట్యాప్‌, ఒక హ్యాండ్‌ షవర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి బెర్తుకూ బాటిల్‌ హోల్డర్‌, త్రీ పెగ్‌ కోట్‌ హుక్స్‌,కిటికీల నుంచి దోమలు రాకుండా దోమతెరలు ఏర్పాటు చేశారు. ప్రతి క్యాబిన్‌లో మూడు డస్ట్‌బిన్‌లు, వీటిలో బయోడీ గ్రేడబుల్‌ డిస్పోజబుల్‌ గార్బేజ్‌ బ్యాగ్‌లను ఉంచారు. రోగులు తమ ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లను చార్జింగ్‌ చేసుకోడానికి వీలుగా చార్జింగ్‌ సాకెట్స్‌ ఉన్నాయి. కోచ్‌లో ఫస్ట్‌ క్యాబిన్‌ భాగాన్ని పారామెడికల్‌ ఏరియా, స్టోర్‌ ఏరియాలుగా ఉపయోగించుకోవచ్చు.


By April 03, 2020 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-railways-manufactures-2-6-lac-masks-and-25000-litres-of-sanitiser/articleshow/74962541.cms

No comments