Breaking News

ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు దాటిన కరోనా కేసులు.. 1.77 లక్షల మంది బలి


ప్రపంచవ్యాప్తంగా తీవ్రత కొనసాగుతోంది. మహమ్మారి విజృంభణ కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా.. వైరస్‌ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పాతిక లక్షలు దాటేసింది. వైరస్‌ను కట్టడిచేయడానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను దశలవారీగా సడలించేందుకు సమాయత్తమవుతున్నాయి. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలను పలు దేశాలు ప్రారంభించాయి. అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆంక్షల సడలింపు ప్రణాళికలను సిద్ధం చేస్తుండగా.. ఐరోపాలోని దేశాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. జార్జియాలో ఆంక్షలను క్రమంగా ఎత్తివేయనున్నట్లు గవర్నర్‌ బ్రియాన్‌ కెంప్‌ ప్రకటించారు.టెక్సాస్‌లో ఈ వారం నుంచే పార్కులను తెరుస్తామని, స్టోర్లలో కార్యకలాపాలకు అనుమతిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. కరోనా సంక్షోభానికి అత్యాధునిక 5జీ మొబైల్‌ నెట్‌వర్కే కారణమంటూ ఐరోపాలో దాడులకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. యూకేలో ‘5జీ’కి సంబంధించిన దాదాపు 50 సెల్‌ టవర్లకు దుండగులు నిప్పంటించారు. నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, సైప్రస్‌, బెల్జియంల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 25.55 లక్షల మంది కరోనా వైరస్ బారినపడగా.. వీరిలో దాదాపు ఏడు లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 177,641 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 57వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. అత్యధికంగా అమెరికాలో 45,340 మంది ఇప్పటి వరకూ మృత్యువాతపడ్డారు. దీని తర్వాతి స్థానాల్లో ఇటలీ 24,648, స్పెయిన్ 21,282, ఫ్రాన్స్ 20,796, బ్రిటన్ 17,337, బెల్జియం 5,998, ఇరాన్ 5,297, జర్మనీ 5,086, చైనా 4,632, నెదర్లాండ్ 3,916, బ్రెజిల్ 2,741 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 819,164కు చేరుకోగా.. స్పెయిన్ 2లక్షలు దాటేసింది. ఇటలీలో లక్షా 84వేల మంది వైరస్ బారినపడగా... ఫ్రాన్స్‌లో లక్షా 59వేల మందికి పాజిటివ్‌గా తేలింది. జర్మనీ లక్షా 49వేలు, బ్రిటన్ లక్షా 30వేలు, టర్కీ 96వేల మంది, ఇరాన్ 85వేల మంది, చైనాలో 83వేల మంది, రష్యాలో 52 వేల మంది, బ్రెజిల్ 43 వేలు, బెల్జియం 41వేలు, కెనడా 38వేలు, నెదర్లాండ్ 34 వేలు, స్విట్జర్లాండ్ 28వేలు, పోర్చుగల్ 21వేలు, భారత్‌లో 20వేల మంది వైరస్ బారినపడ్డారు. బ్రిటన్‌లో ఒక్క మంగళవారం 828 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 17,337కు పెరిగింది. బ్రిటన్‌లో సిక్కు వర్గం నుంచి తొలి అత్యవసర వైద్య సేవల నిపుణుడిగా గుర్తింపు పొందిన మన్‌జీత్‌ సింగ్‌ రియత్‌ కరోనా బారినపడి కన్నుమూశారు. సింగపూర్‌లో కొత్తగా 1,111 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. కరోనా వైరస్‌ పుట్టుకపై స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా అన్ని దేశాలు కృషి చేయాలని ఆస్ట్రేలియా పిలుపునిచ్చింది. మహమ్మారి నియంత్రణలో డబ్ల్యూహెచ్‌వో పనితీరును విశ్లేషించాల్సిన ఆవశ్యకతనూ నొక్కిచెప్పింది. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సైతం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోనున్నారు. హ్యూమనిస్ట్ ఫైసల్‌ గతవారం ఇమ్రాన్‌ను కలిశారు. తాజాగా ఫైసల్‌ కరోనా బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో ఇమ్రాన్‌ కూడా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోనున్నారు. మరోవైపు, అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు వలసల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దాన్ని ఎంత కాలం వరకు అమలు చేయనున్నారో కూడా స్పష్టతనిచ్చారు. 60 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఇది ముఖ్యంగా శాశ్వత నివాస హోదా(గ్రీన్‌ కార్డు) కోసం వచ్చేవారిని లక్ష్యంగా చేసుకునే అమల్లోకి తెస్తున్నట్లు అర్థమవుతోంది.


By April 22, 2020 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/globally-more-than-2557181-are-infected-and-over-177600-have-died-due-to-coronavirus/articleshow/75284884.cms

No comments