అమెరికాలో కరోనా కరాళనృత్యం: 24 గంటల్లో 2,569 మంది మృతి.. 30వేలకుపైగా కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన 10 రోజుల నుంచి రోజుకు 2వేల మంది కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ కరోనాతో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకోలేదు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2,569 మంది మృత్యువాత పడ్డారు. జాన్స్‌హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రకారం అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత ఇప్పటి వరకు ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. అమెరికాలో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు జాన్స్‌హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. అమెరికాలో కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య 28,526కి చేరింది. ఏప్రిల్ తొలివారం వరకూ అత్యధిక ఇటలీలో సంభవించగా, దానిని అమెరికా అధిగమించింది. అత్యధికంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, మరణాలు అమెరికాలోనే సంభవిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 30 వేల మంది వైరస్ బారినపడ్డారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 644,089కి చేరింది. అమెరికాలోని మొత్తం కరోనా మరణాల్లో 11 వేలకుపైగా ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకూ 10,367 మంది ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, అధికారులు చెబుతున్నట్టు లెక్కలు సరైనవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఇప్పటివరకు 10 వేల మందికిపైగా చనిపోయినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి ఈ నగరంలో 6,589 మంది మరణించారు. అయితే, ‘‘కొవిడ్-19 లేదా దాని సమానమైన అనారోగ్యం’’ కారణంగా మృతిచెందినట్లు న్యూయార్క్ నగరంలో మరో 3,778 మరణ ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొని ఉంది. ఈ మృతులను తాము కరోనా సంబంధిత లెక్కల్లో పరిగణనలోకి తీసుకోలేదని నగర ఆరోగ్య కమిషనర్ ఆక్సిరిస్ బార్బోట్ వెల్లడించారు. ఆ సంఖ్యను కూడా కలిపి చూస్తే నగరంలో మరణాల సంఖ్య 10 వేలు దాటుతుందని తెలిపారు. న్యూయార్‌లో మొత్తం 214,648 మంది, న్యూజెర్సీలో 71,030 మంది, మస్సూచూసెట్స్ 29,918, మిచిగాన్ 28,059 మంది, కాలిఫోర్నియా 26,838, పెన్సుల్వేనియా 26,753 మంది, ఇల్లినాయిస్ 24,593, ఫ్లోరిడా 22,519, లూసియానా 21,951, టెక్సాస్ 16,009, జార్జియా 15,160, కనెక్టికట్ 14,755, వాషింగ్టన్ 10,910, మేరీల్యాండ్ 10,032 మంది వైరస్ బారినపడ్డారు. అత్యధికంగా న్యూయార్క్‌లో 11,588 మంది ప్రాణాలు కోల్పోగా.. తర్వాతి స్థానంలో న్యూజెర్సీ 3,156, మస్సూచూసెట్స్ 1,108, మిచిగాన్ 1,921, కాలిఫోర్నియా 864, పెన్సుల్వేనియా 779, ఇల్లినాయిస్ 948, లూసియానా 1,103, ఫ్లోరిడా 614, కనెట్టికట్ 868 ఉన్నాయి. వైరస్ వల్ల న్యూయార్క్ రాష్ట్రానికి దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యానించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు, రాష్ట్రాల్లో పరిస్థితులపై ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
By April 16, 2020 at 09:35AM
No comments