కరోనా వైరస్: 1.60 లక్షలు దాటిన మృతులు.. 24 గంటల్లోనే 10 వేల మంది బలి
మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలతో అన్ని దేశాలూ అల్లాడిపోతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ కోవిడ్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియంలో మృత్యుఘోష కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,331,892 మంది కరోనా వైరస్ బారినపడగా.. వీరిలో 160,763 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లోనే దాదాపు 10వేల మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలలో అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో ఉంది. అక్కడ 7.38 లక్షల మందికి వైరస్ సోకగా.. దాదాపు 40 వేల మంది మంది మృతిచెందారు. ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకూ అక్కడ 2.41 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, 17,600 మంది మృతిచెందారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌లోనూ అధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కట్టడికి విధించిన ఆంక్షల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతినకుండా... రైతులు, వ్యవసాయ కార్యకలాపాలకు 19 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ట్రంప్ ప్రకటించారు. నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ ప్రధాన సహాయకుడు కరోనా కారణంగా మృతిచెందినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కేసులు, మరణాల సంఖ్యను చైనా సవరించింది. విదేశాల నుంచి వచ్చినవారిలో కొత్తగా 27 కేసులు నమోదయ్యాయని, దీంతో కేసుల సంఖ్య 1,566కు పెరిగిందని తెలిపింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్... తన 94వ పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. స్పెయిన్‌లో 20,639 మంది, ఇటలీలో 23,227 మంది, ఫ్రాన్స్ 19,323 మంది, బ్రిటన్‌లో 15,464 మంది, బెల్జియం ,5453 మంది, ఇరాన్‌లో 5,031 మంది, జర్మనీలో 4,538, చైనాలో 4,632 మంది ప్రాణాలు కోల్పోయారు. నెదర్లాండ్ 3,601, బ్రెజిల్ 2,372, కెనడా 1,470, స్విట్జర్లాండ్ 1,386, స్వీడన్ 1,511, పోర్చుగల్ 687 మంది కోవిడ్ కారణంగా మృతిచెందారు. అమెరికాలో 738,913, స్పెయిన్‌లో 194,416, ఇటలీలో 175,925, ఫ్రాన్స్‌లో 151,793, జర్మనీలో 143,724, బ్రిటన్‌లో 114,217, చైనాలో 82,735, టర్కీలో 82,329, ఇరాన్ 80,329, బెల్జియం 37,183, బ్రెజిల్ 36,925, రష్యా 36,793, కెనడా 33,383, నెదర్లాండ్ 31,589, స్విట్జర్లాండ్ 27,404లో కేసులు నమోదయ్యాయి. సింగపూర్‌లో 942 శనివారం 942 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ తదితర దేశాల నుంచి వచ్చి డార్మెటరీల్లో ఉంటున్నవారిలోనే ఎక్కువగా ఈ కేసులు వెలుగు చూశాయి. బ్రిటన్ వ్యాప్తంగా కేర్ హోమ్స్‌లో ఉంటున్నవారిలో దాదాపు 7,500 మంది కరోనా కారణంగా మృతిచెందారని కేర్ హోమ్స్ నిర్వాహకుల సంఘం ‘కేర్ ఇంగ్లండ్’ పేర్కొంది. అధికారిక లెక్కల కంటే ఇది దాదాపు ఐదు రెట్లు ఎక్కువంటూ డైలీ టెలిగ్రాఫ్ కథనం అందించింది. ‘‘ఏప్రిల్ 1 నుంచి లెక్కగడితే కరోనా లక్షణాలతో కేర్ హోమ్స్‌లో చనిపోయినవారి సంఖ్య 7,500 వరకూ ఉండొచ్చు. అయితే వీరిలో చాలామందికి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు’’ అని కేర్ ఇంగ్లండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
By April 19, 2020 at 09:10AM
No comments