Breaking News

కెనడా: పోలీస్ దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డ దుండగుడు.. 16 మంది మృతి


కెనడాలో ఓ ముష్కరుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రాష్ట్రంలోని పోర్టాపిక్యూ ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు సహా 16 మంది మృతిచెందారు. పోలీసుల కాల్పుల్లో ముష్కరుడు కూడా మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక యంత్రాంగం.. ఇప్పటికే కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించగా.. ప్రజల్ని అసలే బయటకు రావొద్దని సూచించారు. పోలీసుల దుస్తుల్లో వచ్చిన నిందితుడు.. ఉపయోగించిన కారు కూడా పోలీసుల వాహనంలాగే రూపొందించాడని అధికారులు తెలిపారు. కారులో పారిపోతున్న నిందితుడ్ని పోలీసులు వెంబడించి కాల్చి చంపారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కానిస్టేబుల్ హైడీ స్టీవెన్‌సన్ ముష్కరుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు.. కొందరు తమ బిడ్డలను, స్నేహితులను, సహచరులను, ఆప్తులను కోల్పోయారని పోర్టాపిక్యూ నగర పోలీస్ కమిషనర్ బెర్గర్‌మెన్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను అత్యంత భయంకరమైన పరిస్థితిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభివర్ణించారు. కెనడా చరిత్రలో 30 ఏళ్ల తర్వాత ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి కెనడాలో గన్ వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు. తమ ప్రావిన్సుల చరిత్రలోనే అత్యంత హింసాత్మక ఘటనగా నోవా స్కాటియో గవర్నర్ స్టీఫెన్ మెక్‌నెయిల్ వ్యాఖ్యానించారు.


By April 20, 2020 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/gunman-kills-at-least-16-in-nova-scotia-provinces-in-canada/articleshow/75243323.cms

No comments