దేశంలో 13,500కి చేరిన కోవిడ్ బాధితులు.. నిన్న ఒక్క రోజే మధ్యప్రదేశ్‌లో 360 కేసులు
దేశంలో కేసుల సంఖ్య బుధవారం కాస్త తగ్గినా.. గురువారం భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,260 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మరో 26 మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లో రికార్డుస్థాయిలో ఒక్క రోజే 361 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఒకే రాష్ట్రంలో కేసులు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. దీంతో మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు ఒక్కసారిగా దాదాపు 1,300కి చేరాయి. ఒక్క ఇండోర్ నగరంలోనే 244 మంది గురువారం వైరస్ బారినపడ్డారు. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 13,500కు చేరుకోగా.. మహమ్మారి బారినపడి 449 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లోనే 810 కేసులు నమోదు కాగా.. మిగతా రాష్ట్రాల్లో 450పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గురువారం ఒక్కసారిగా కేసులు పెరగడంతో దేశంలోనే అత్యధికంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మూడో స్థానానికి చేరుకుంది. మహారాష్ట్రలో మరో 286 మందికి గురువారం వైరస్ నిర్దారణ అయ్యింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం మూడోసారి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,200 దాటింది. నాలుగు రోజుల్లోనే మహారాష్ట్రలో 1,000కిపైగా కేసులు నమోదుకావడం గమనార్హం. ముంబయి నగరంలోనూ గురువారం 177 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశ ఆర్ధిక రాజధానిలో కరోనా కేసులు 2,073కు చేరాయి. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారవీలో 26 మంది తాజాగా వైరస్ బారినపడ్డారు. కేవలం ఆరు రోజుల్లోనే ముంబయిలో కోవిడ్ కేసులు రెట్టింపు నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీలో 62 కేసులు నమోదు కాగా.. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 1,640కి చేరగా.. మృతుల సంఖ్య 38 దాటింది. మహారాష్ట్రలో ఏడుగురు, గుజరాత్‌లో మూడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరేసి, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ స్టేట్ కేన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగికి వైరస్ సోకగా.. అతడు గురువారం చనిపోయాడు. దీంతో డీఎస్‌సీఐ కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఇక్కడ కనీసం నలుగురు కేన్సర్ రోగులు, 30కిపై వైద్య సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 700కి చేరిందన్నారు. బుధవారం కేవలం ఆరు కేసులే నిర్ధారణ కాగా.. గురువారం మాత్రం మళ్లీ కేసులు పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, 68 మంది కోవిడ్ రోగులు కోలుకోవడం సానుకూలంశం. వీరిని గురువారం ఇళ్లకు పంపారు. కరోనా వ్యాప్తి నేసథ్యంలో అదనపు పడకల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలనుకున్న గచ్చిబౌలి ఆస్పత్రిని ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గురువారం తొమ్మిది కేసులే నిర్ధారణ అయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్ కేసులు 534కి చేరాయి. తెలంగాణలో 18 మంది చనిపోగా, ఏపీలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 163 కేసులు నిర్ధారణ కాగా.. అహ్మదాబాద్, సూరత్ నగరాల్లోనే పెద్ద సంఖ్యలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. గుజరాత్‌లోని 59 శాతం కేసులు అహ్మదాబాద్ నగరంలోనే నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 929కి చేరింది. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 55 కేసులు నిర్ధారణ కాగా.. అంతకు ముందుతో పోల్చితే కొత్త కేసులు తగ్గాయి. రాజస్థాన్‌లో మొత్తం 1,131 మందికి పాజిటివ్‌గా తేలింది. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కే కేరళలో మాత్రం కోవిడ్-19 కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గురువారం ఏడు కేసులు నిర్ధారణ కాగా.. బాధితుల సంఖ్య 394కి చేరింది. అయితే, ఇప్పటికే వీరిలో 240కిపైగా కోలుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 10 శాతం మంది కోవిడ్ బాధితులు కోలుకోగా.. అత్యధికంగా కేరళలో 245 మంది, తెలంగాణలో 186 మంది, తమిళనాడులో 180 మంది ఉన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో 164 చొప్పున ఉండగా.. ఢిల్లీలో మాత్రం కోలుకున్నవారి శాతం తక్కువగా ఉంది. మొత్తం 1,640 మంది వైరస్ బారినపడగా కేవలం 51 మంది మాత్రమే కోలుకున్నారు.
By April 17, 2020 at 07:55AM
No comments