Breaking News

దేశంలో 1,000 దాటిన కరోనా మరణాలు.. ఆ రాష్ట్రంలో జాతీయ సగటును మించి!


దేశంలో మహమ్మారి వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టినా.. పాజిటివ్ కేసులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,890 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా. మరో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,411కి చేరుకోగా.. మరణాలు 1,000 దాటాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 9,289 మందికి వైరస్ సోకింది. మరణాలు కూడా ఇక్కడ 400కి చేరాయి. మంగళవారం మహారాష్ట్రలో అత్యధికంగా 31 మంది ప్రాణాలు కోల్పోగా, గుజరాత్‌లో 19, మధ్యప్రదేశ్ 10, ఉత్తరప్రదేశ్ 3 నమోదయ్యాయి. ముంబయి, అహ్మదాబాద్‌లోనే పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు మృత్యువాతపడుతున్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 7,700 మందికిపైగా కోలుకోవడం శుభపరిణామం. మంగళవారం అత్యధికంగా మహారాష్ట్రలో 729 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. తర్వాతి గుజరాత్ 226, మధ్యప్రదేశ్ 222, ఢిల్లీ 206, తమిళనాడు 121 కేసులు బయటపడ్డాయి. రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరేసి, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,314కి చేరింది. దీంతో దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (9,218), గుజరాత్ (3,774), మధ్యప్రదేశ్ (2,387), రాజస్థాన్ (2,364), తమిళనాడు (2058), ఉత్తరప్రదేశ్ (2,053), ఆంధ్రప్రదేశ్ (1,259), తెలంగాణ (1,009), పశ్చిమ్ బెంగాల్ (697) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం 400 మంది కోవిడ్-19తో చనిపోగా.. ఒక్క ముంబయిలోనే 244 మంది మృతిచెందారు. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారవీలో మంగళవారం మరో 45 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 335గా నమోదయ్యింది. ముంబయి తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోనే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఏపీలోనూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. మంగళవారం మరో 82 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,259కి చేరింది. అయితే, పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించడంతోనే కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 5,700 మందికి పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మాత్రం కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఆరు రోజులగా సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదుకావడం సానుకూలంశం. కానీ, తక్కువ సంఖ్యలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం అనుమానిత లక్షణాలతో హాస్పిటల్‌లో చేరినవారికే పీసీఆర్ పరీక్షలు నిర్వహించడం వల్ల పాజిటివ్ కేసులు తక్కువ నమోదవుతున్నాయి.


By April 29, 2020 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-record-1840-and-69-deaths-on-tuesday-covid-death-toll-passes-1000/articleshow/75440654.cms

No comments