తబ్లిగీ సభ్యులను పట్టిస్తే రూ.10 వేలు.. కేసులు పెరుగుతున్న వేళ కీలక ప్రకటన
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనల ఘటన సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ మత కార్యక్రమానికి హాజరైన తబ్లిగీ జమాత్ కార్యకర్తల కారణంగా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. కేసులు అనూహ్యంగా పెరిగాయి. కొన్ని కుటుంబాల్లో 25 మందికి, 16 మందికి వైరస్ సోకిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వీరి ప్రవర్తనా తీరులో మార్పు రావడం లేదు. కొంత మంది ఇప్పటికీ వైద్య పరీక్షల కోసం ముందుకు రాకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఎవరైనా తబ్లిగీ కార్యకర్తలకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ.10 వేల నజరానా అందిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో మత కార్యక్రమానికి వెళ్లొచ్చి రహస్యంగా దాచుకున్న వారికి సంబంధించిన సమాచారం ఇచ్చినా ఈ నజరానా ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ‘గత నెల ఢిల్లీలో మర్కజ్ భవన్ మత కార్యక్రమానికి వెళ్లొచ్చిన కొంత మంది ఇప్పటికీ రహస్యంగా ఉంటున్నారు. ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినా వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదు. తద్వారా వారి కుటుంబసభ్యులకే కాకుండా సమాజానికి కూడా ప్రమాదకరంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మోహిత్ అగర్వాల్ పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గడిచిన మూడు రోజుల్లో కాన్పూర్ పట్టణంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయని ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకూ 74 కేసులు నమోదు కాగా.. వీటిలో అత్యధికం ఢిల్లీ మర్కజ్ మత సమావేశాలతో లింక్ ఉన్నవేనని వివరించారు. ఇప్పటికైనా పరిస్థితి అర్థం చేసుకొని వైద్య పరీక్షలకు సహకరించాలని.. వ్యక్తిగతంగా ముందుకొచ్చిన వారిపై ఎలాంటి చర్యలు ఉండవని మోహిత్ అగర్వాల్ స్పష్టం చేశారు. దాచాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. Also Read:
By April 21, 2020 at 08:47AM
No comments