ఏప్రిల్ 1 నుంచి 40% తగ్గిన కొత్త కేసుల గ్రోత్ ఫ్యాక్టర్.. రెట్టింపునకు 6 రోజుల సమయం
దేశంలో మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయానికి 14 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,100 కొత్త కేసులు వెలుగుచూడగా, మరో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే... లాక్‌డౌన్ విధించడంతో దేశంలో పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో పాజిటివ్ కేసుల గ్రోత్ ఫ్యాక్టర్‌లో 40 శాతం తగ్గుదల నమోదైందని, రెట్టింపు కావడానికి ప్రస్తుతం ఎక్కువ సమయం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ఏప్రిల్ 1కి ముందు రెండు వారాలతో పోల్చితే కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 6.2 రోజుల పడుతోందని శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు రెట్టింపు నమోదుకు... లాక్‌డౌన్ విధించడానికి ముందు దాదాపు మూడు రోజులు పట్టేదని, గత ఏడు రోజుల వివరాలను బట్టి ప్రస్తుతం ఇందుకు 6.2 రోజులు పడుతోందన్నారు. దేశంలోని 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రెట్టింపు నిష్పత్తి దేశ సగటు కంటే తక్కువగానే ఉందన్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఛండీగఢ్, పుదుచ్చేరి, బిహార్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జమ్మూ-కశ్మీర్, లడఖ్, పంజాబ్, అసోం, త్రిపుర ఉన్నాయని తెలిపారు. లాక్‌డౌన్, క్షేత్రస్థాయిలో నిబంధనలు ఎలా అమలుచేస్తున్నామనే దానిపైనే కేసుల వృద్ధి ఆధారపడి ఉంటుందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు 5 లక్షల యాంటీ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పంపిణీ చేస్తున్నామని, దేశీయ సంస్థల ద్వారా మే నెలలో 10 లక్షల ఆర్‌టీపీసీఆర్ కిట్లు తయారు చేయనున్నామని ఆయన వెల్లడించారు. మరో 10 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ కిట్లను వచ్చే నెలలోగా దేశీయంగా తయారు చేస్తామన్నారు. ప్రతినెలా 6 వేల వెంటిలేటర్లను తయారుచేసే సామర్థ్యానికి దేశీయ సంస్థలు చేరుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేశంలో మార్చి 15 నుంచి 31 మధ్య రెట్టింపు కేసులు నమోదుకు 2.1 రోజులు పడితే.. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ 1.2 రోజులు పడుతోందని అన్నారు. ఇది గ్రోత్ రేట్‌లో ఇది 40 శాతం తగ్గుదలని వివరించారు. హాట్‌స్పాట్‌లు, పాజిటివ్ కేసులు నమోదయిన ప్రాంతాల్లో నిరంతరాయంగా పర్యవేక్షణ, పటిష్ఠ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కోలుకుంటున్న కరోనా బాధితుల రేటు కూడా పెరిగినట్టు వెల్లడించారు. మృతుల సంఖ్య సైతం తగ్గిందని పేర్కొన్నారు. గురువారం నాటికి కేరళలో 245 మంది, తెలంగాణలో 186 మంది, తమిళనాడులో 180 మంది, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో 164 మంది చొప్పున కోలుకున్నారు. అయితే, ఢిల్లీలో రికవరీ శాతం మాత్రం తక్కువగానే ఉంది. అక్కడ 16,40 మంది వైరస్ బారినపడితే కేవలం 51 మంది మాత్రమే ఇప్పటి వరకూ కోలుకున్నట్టు తెలిపారు. గతవారం రోజుల నుంచి దక్షిణాదిలోని కేరళ, తమిళనాడులో కొత్త కేసులు సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో బాధితులు కోలుకున్నారు. ఏప్రిల్ 11 నుంచి 17 వరకు కేరళలో 32 కేసులు నమోదు కాగా.. 129 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 395కు చేరుకోగా.. ఆరంభంలో కేసుల సంఖ్యను బట్టి ఏప్రిల్ 15 నాటికి 500 దాటుతుందని భయపడినట్టు లవ్ అగర్వాల్ వివరించారు. డయాబెటిస్, రక్తపోటు, ఇతర అనారోగ్య కారణాలున్న కోవిడ్ బాధితులు కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని, వీరిలో రికవరీ రేటు మెల్లగా ఉందన్నారు. గురువారం నాటికి 13,541 కేసులు ఉండగా.. 1,437 మంది (10.6 శాతం) కోలుకున్నారు.. అదే శుక్రవారం ఇది 13.06గా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడానికి టెస్టింగ్ సామర్థ్యం పెంచడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
By April 18, 2020 at 07:42AM
No comments