Breaking News

నిర్భయ దోషికి సుప్రీం షాక్.. రేపటి ‘ఉరి’పై తీవ్ర ఉత్కంఠ


నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, దోషులు మాత్రం మరోసారి ఉరిని వాయిదా వేయించుకోవాలని చేయని ప్రయత్నం లేదు. తమకు ఉన్న న్యాయపరమైన అంశాలను దోషులు వినియోగించుకుంటున్నారు. తాజాగా, నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. పవన్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం.. దోషికి కింది కోర్టు ఉరిశిక్ష విధించడంలో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడింది. తన ఉరిశిక్షను యావజ్జీవిత శిక్షగా మార్చాలని కోరుతూ దోషి పవన్ గుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఘటన జరిగే నాటికి తాను మైనర్‌నని, కింది కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరాడు. అయితే, అతడి వాదనలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరించడంతో దోషి తనకున్న చివరి అవకాశాన్ని వినియోగించుకోకున్నాడు. క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేయనున్నాడు. పవన్ గుప్తా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నలుగురు దోషులకు న్యాయపరంగా అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. గతవారమే క్యూరేటివ్ పిటిషన్‌ను పవన్ గుప్తా దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించడంతో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ముఖేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా దీనిని సుప్రీంలో సవాల్ చేశారు. అక్షయ్ కుమార్ మాత్రం దీనిపై సుప్రీంలో పిటిషన్ వేయలేదు. మార్చి 3న ఉదయం 6.00 గంటలకు ఉరిశిక్ష అమలుచేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీచేసినా, అమలుపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ తన చివరి అవకాశం వినియోగించుకోనుండగా, ఉరి శిక్షపై మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ అతడు దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉరి అమలవుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.


By March 02, 2020 at 11:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-dismissed-nirbhaya-convict-pawans-curative-petition/articleshow/74435538.cms

No comments