Breaking News

కరోనా వైరస్ లైప్ అప్‌డేట్స్: చైనాను దాటేసిన అమెరికా.. న్యూయార్క్‌లో దారుణ పరిస్థితులు


ప్రపంచవ్యాప్తంగా తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఐరోపా, అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. కరోనా వైరస్‌ను నియంత్రణ కోసం చేపట్టిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ సమయంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని, లాక్‌డౌన్‌ రాష్ట్రాలు సమర్ధవంతంగా అమలుచేయాలని సూచించింది. లాక్‌డౌన్ విధించినప్పటికీ.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 700 దాటింది. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోగా గురువారం అత్యధికంగా ఏడుగురు మృతిచెందారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. పంజాబ్ ప్రావిన్స్‌లోని కోవిడ్ పేషెంట్లను పాకిస్థాన్ ఆర్మీ బలవంతంగా పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బల్టిస్థాన్‌కు పంపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో పేషెంట్లు లేకుండా చూడటం కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మిర్పూర్, ఇతర ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారని సమాచారం. కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 68,472కు చేరగా... మరణాల సంఖ్య 1032కి చేరింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 223 కరోనా మరణాలు సంభవించాయంటేనే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ భయంతో గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛందంగా సెలవులపై వెళ్తున్నారు. అందులో పని చేస్తున్న నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు కరోనా వార్డులో పనిచేయలేమంటూ తేల్చి చెప్తున్నారు. ఐసోలేషన్ వార్డులో కరోనా రోగులకు 24 గంటలూ సేవలందిస్తున్నామని, కానీ తమ జాగ్రత్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వచ్చిన వారిని కూడా రెండు వారాల పాటు క్వారంటైన్‌‌లో ఉంచిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరుకుంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ గురువారం (మార్చి 26) సమీక్షించారు. గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు..


By March 27, 2020 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-death-news-live-updates-andhra-and-telangana-across-india-and-globally-in-telugu/articleshow/74839670.cms

No comments