Breaking News

లాక్‌డౌన్‌లోకి న్యూయార్క్.. ప్రపంచవ్యాప్తంగా వైద్య సామాగ్రి కొరత


అమెరికాలోనూ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి మరణించిన వారిసంఖ్య 419కు చేరింది. బాధితుల సంఖ్య కూడా 33వేల దాటింది. అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటికే పలు నగరాలను మూసివేశారు. తాజాగా, న్యూయార్క్ నగరం సైతం లాక్‌డౌన్‌లోకి వెళ్లనుంది. 8.5 మిలియన్ల మంది జనాభా కలిగిన న్యూయార్క్ నగరంలో వైరస్ కేసులు సంఖ్య పెరిగితే ప్రపంచంలోనే మరో అతిపెద్ద వైరస్ కేంద్రంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని లాక్‌డౌన్ చేయాలని న్యూయార్క్ మేయర్ బిల్డే బ్లాసియో సిద్ధమవుతున్నారు. దీనిపై సోమవారం కీలక ప్రకటన చేయనున్నారు. మాస్క్‌లు నుంచి గౌన్ల వరకు, వైద్యులు, ఇతర సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని మేయర్ పిలుపునిచ్చారు అలాగే వైద్య సామాగ్రిని తయారుచేసే, పంపిణీ చేసే లాజిస్టిక్‌లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ఈ విషయంలో తనకు అధికారాలు పరిమితమని, అధ్యక్షుడు సరైన సమయంలో స్పందించి చర్య తీసుకోకపోతే వేలాది మంది చనిపోతారని డి బ్లాసియో వ్యాఖ్యానించారు. మరోవైపు, వైద్య సామాగ్రి నిల్వలు తగ్గిపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. న్యూయార్క్ నగరం సహా వైరస్ వ్యాపించిన ఇతర ప్రదేశాల్లో అత్యవసరమైన వైద్య సామాగ్రి కొరత ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న వేళ పలు దేశాల్లో వైద్య సామగ్రి నిల్వలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల సంఖ్య మరింత పెరిగితే, వారికి మెరుగైన చికిత్స అందజేయడానికి అవసరమైన మౌలిక వసతులు చాలా ఆస్పత్రుల్లో లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఐరోపా, అమెరికాల్లోని హాస్పిటల్స్‌లో అదనపు పడకలను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతుంది. వైద్య సామగ్రి నిల్వలు బాగా తగ్గిపోతుండటంతో వాటి కొనుగోలు కోసం ప్రపంచమంతటా అన్వేషిస్తున్నామని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో వ్యాఖ్యానించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. కాగా, మిన్నియాపొలిస్‌, ఒక్లహామా సిటీ తదితర నగరాల్లోని వ్యక్తిగత పరిరక్షణ పరికరాల కొనుగోలు కోసం ఆరోగ్య సిబ్బంది విరాళాలు కోరడం గమనార్హం. డెట్రాయిట్‌లోని ఓ ఆస్పత్రి తమ సిబ్బంది కోసం మాస్కులను ఇళ్లలోనే తయారు చేయిస్తోంది.


By March 23, 2020 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/new-york-to-shut-down-as-it-becomes-next-virus-hot-spot-officials-worldwide-warned-shortage-of-medical-supplies/articleshow/74767679.cms

No comments