Breaking News

లాక్‌డౌన్ ఎఫెక్ట్: క్యాబ్ సర్వీసులను నిలిపేసిన ఉబర్.. ఓలా మాత్రం


కరోనా వైరస్‌ను కట్టడి చేయడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయా? ఉండవా? అనే అనుమానం చాలా మందికి వచ్చింది. దీంతో సోమవారం నుంచి మీ క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయా? అని చాలా మంది ఉబర్ సంస్థను ట్విట్టర్ ద్వారా అడగటం ప్రారంభించారు. వీరందరికీ ఉబర్ సంస్థ సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీ నగరంలో ఉబర్ రైడ్ సేవలను నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. లాక్‌డౌన్ ప్రకటించిన రాష్ట్రాల్లో ప్రజారవాణాను నిలిపేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సేవలు ఆగిపోయాయి. ఆటోలను కూడా నిలిపేశారు. కోవిడ్‌ను అరికట్టడానికి ఉబెర్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఓలా మాత్రం చాలా చోట్ల క్యాబ్ సర్వీసులు యథావిధిగా నడుస్తున్నట్లు ప్రకటించింది. కానీ బుకింగ్‌లు మాత్రం మీరున్న ప్రాంతం, సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయని తెలిపింది. ఓలా సంస్థ క్యాబ్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ.. మీరున్న ప్రాంతంలో క్యాబ్‌లు అందుబాటులో ఉంటేనే బుక్ చేయడం సాధ్యపడుతుంది. ఓసారి యాప్ చెక్ చేసుకోండి అని ఓలా సలహా ఇచ్చింది.


By March 23, 2020 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-effect-in-compliance-with-the-govt-guidelines-uber-temporarily-suspends-all-cab-and-ride-services/articleshow/74766561.cms

No comments