Breaking News

దేశంలో 700 దాటిన కరోనా కేసులు.. 20 మంది మృతి, నిన్న ఒక్క రోజే ఏడుగురు బలి


కరోనా వైరస్‌ను నియంత్రణ కోసం చేపట్టిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ సమయంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని, లాక్‌డౌన్‌ రాష్ట్రాలు సమర్ధవంతంగా అమలుచేయాలని సూచించింది. ప్రజలు కూడా ఎలాంటి అలసత్వానికి తావులేకుండా సామాజిక దూరం పాటించాలని పేర్కొంది. మరోవైపు, లాక్‌డౌన్ విధించినప్పటికీ.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 700 దాటింది. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోగా గురువారం అత్యధికంగా ఏడుగురు మృతిచెందారు. దేశంలో కేసులు నిర్ధారణ అయిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మృతిచెందడం ఇదే తొలిసారి. గురువారం ఉదయానికి భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 657గా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మొత్తం 70 మందికి నిర్ధారణ కావడంతో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 727కి చేరుకుంది. సోమవారం నుంచి పోల్చితే ఈ వారంలో ఇదే అత్యల్పం నమోదు. కరోనా వైరస్ బారినపడ్డ అనంతపురానికి చెందిన 75 ఏళ్ల మహిళ కర్ణాటకలో చనిపోయింది. మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో 35 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన మృతుడికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. గురువారం కేరళలో అత్యధికంగా 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 137కి చేరింది. మధ్యప్రదేశ్‌లో గురువారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలగా.. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21గా నమోదయ్యింది. బిహార్‌లో‌నూ 20 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. ఆ రాష్ట్రంలోని కేసుల సంఖ్య ఏడుకి పెరిగింది. తెలంగాణలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో ఇద్దరు డాక్టర్ దంపతులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరుకోగా.. ఒకరు కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్‌లో మరో ఐదుగురులో వైరస్ ఉన్నట్టు గుర్తించడంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా పెరుగుదల రేటు నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే.. కరోనా సామూహిక వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటి వరకు 50 మంది బాధితులు కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 125, కేరళలో 137, ఢిల్లీలో 36, ఉత్తరప్రదేశ్‌లో 42, కర్ణాటకలో 55,లడఖ్ 14, తెలంగాణ 45, రాజస్థాన్ 50, జమ్మూ కశ్మీర్‌లో 14, గుజరాత్ 43, పంజాబ్ 33, హర్యానా 32, తమిళనాడు 29, ఆంధ్రప్రదేశ్11, పశ్చిమ్ బెంగాల్‌లో 10, మిగతా రాష్ట్రాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. మొత్తం 722 కేసుల్లో 50 మందికిపైగా విదేశీయులు ఉన్నట్టు పేర్కొంది.


By March 27, 2020 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-in-india-rise-to-720-twenty-died-due-to-coronavirus/articleshow/74838973.cms

No comments