కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: 6 లక్షల మందికి వైరస్.. ఇటలీలో 9,134 మంది బలి

⍟ ప్రపంచవ్యాప్తంగా మరింత విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ 198కిపైగా దేశాల్లో విస్తరించిన ఈ మహమ్మారి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. మెజార్టీ దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. 300 కోట్లమందికిపైగా ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 27,350 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరో రెండు (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ⍟ తెలంగాణలో ఒక్కరోజులోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 14 నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 59కి పెరిగింది. వీరిలో తొలి కరోనా బాధితుడు కోలుకొని ఇంటికెళ్లగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ⍟ దేశంలో కరోనా వైరస్ మరో దశలోకి ప్రవేశించడానికి ముందే కట్టడి చేయాలని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే, కొత్త కేసుల సంఖ్య మాత్రం దేశంలో క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత తొలిసారి శుక్రవారం అత్యధికంగా 150కిపైగా కేసులు నమోదుకావడం ఆందోళన గురిచేస్తోంది. ⍟ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారని సోషల్ మీడియా, వాట్సాప్‌లలో కొంత మంది కోడై కూస్తున్నారు. ఇటీవలే ఇటలీ పర్యటనకు వెళ్లొచ్చిన అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రచారం చేస్తున్నారు. ఓ న్యూస్ ఛానెల్ బ్రేకింగ్ న్యూస్ గ్రాఫిక్ కార్డును స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తున్నారు. ⍟ కరోనా వైరస్ సోకితే ఇక ఖతమేనని చాలా మంది భయపడుతున్నారు. దాదాపు 80 శాతానికి పైగా ప్రజలు ఇళ్లలో ఉండే కరోనాను జయించారని, కేవలం వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే దీని వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం, వైద్యులు చెప్పినా కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటే ఎలాంటి రోగమైనా తగ్గుతుందని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ కుటుంబం నిరూపించింది. ⍟ కరోనా బాధితులున్న ప్రాంతాలను 'కొవిడ్ - 19 క్వారంటైన్డ్ జోన్'గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధించింది. ఇక్కడున్న వారు 14 రోజుల పాటు ఇళ్లల్లోని బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అలాంటి జోన్లలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు ఇంటి వద్దకే అధికారులు పంపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజాల్, కొత్త పేట ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ⍟ కంటికి కనిపించని ఓ సూక్ష్మాతి సూక్ష్మజీవితో ప్రపంచం పోరాటం చేస్తోంది. భూమ్మీద జీవులన్నింటిపై ఆధిపత్యం చెలాయించిన మనిషిని ఓ వైరస్ వణికిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. కరోనా అంటే లాటిన్ బాషలో కిరీటం.. మైక్రోస్కోప్‌లో పరీక్షించినప్పుడు ఈ వైరస్ తల మీద కిరీటంలా కనిపించడంతో వైరస్‌కు ఈ పేరు పెట్టారనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చిత్రాలను భారత శాస్త్రవేత్తలు తొలిసారి బయటపెట్టారు. ⍟ ప్రధాని మోదీ చేసిన లాక్‌డౌన్ ప్రకటన నయా రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ సాధించిన టెలివిజన్ ప్రసంగంగా రికార్డుకెక్కింది. 2016 నోట్ల రద్దు స్పీచ్‌ను ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇండియా వెల్లడించింది. గతంలో ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు అత్యధిక వ్యూయర్‌షిప్ ఉండగా.. తాజాగా లాక్‌డౌన్ ప్రసంగానికి రెండింతల వ్యూయర్‌షిప్ దక్కింది.
By March 28, 2020 at 08:47AM
No comments