జగన్‌కు జీవిత ఖైదు వేయించగల సమర్థుడు చంద్రబాబు: వైసీపీ ఎంపీ
హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కియా ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. బాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, ఆయన చాప్టర్ క్లోజ్ అయిందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కియా ఫ్యాక్టరీ విషయంలో టీడీపీ అధినేత అబద్దాన్ని నిజం చేయాలని భావించారన్నారు. ‘‘నన్ను జగన్ హత్య చేశారు. నేను చనిపోయాను కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరేంత సమర్థుడు చంద్రబాబు. పోలీసు స్టేషన్‌కు నేను కాదు వచ్చింది నా ఆత్మ అని భ్రమింపజేయగలడు. అంతే కాదు చనిపోకున్నా చనిపోయానని చెప్పి జగన్‌కు జీవిత ఖైదు వేయించే సమర్థుడు ఆయన’’ అని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. జగన్ ధర్మ బద్ధంగా పాలిస్తున్నారన్న మాధవ్.. రాయలసీమ జిల్లాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందుకే అమ్మాయిలకు యుక్త వయసు రాగానే పెళ్లిళ్లు చేసే దుస్థితి దాపురించిందన్నారు. మూడు రాజధానుల వల్ల రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. బాబు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కియా ఫ్యాక్టరీ విషయంలో బాబు దుష్పచారం చేశారని.. ఆయన రాయలసీమలో అడుగుపెట్టే ముందు కియా దగ్గరకొచ్చి నేలకు ముక్కు రాస్తే తప్ప ఆయన పాపం ప్రక్షాళన కాదంటూ గోరంట్ల మాధవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కియా దగ్గర నేను దౌర్జన్యం చేశానని బాబు చెబుతున్నారు. కానీ పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కియా ఏర్పాటైంది. అది నెరవేరే వరకు మేం అడుగుతూనే ఉంటామన్న గోరంట్ల మాధవ్.. దాన్ని దౌర్జనం అనడం దారుణమన్నారు. నా ప్రాంతంలోని నిరుద్యోగుల కోసం నూరు శాతం నిలదీసి సాధించుకుంటానని ఎంపీ స్పష్టం చేశారు. లోక్ సభలో కియా ప్లాంట్ విషయమై తప్పుడు ప్రచారం చేయొద్దని తాను టీడీపీ ఎంపీలను కోరానని.. అబద్దం చెప్పి సభను తప్పుదోవ పట్టించొద్దని సూచించానని గోరంట్ల మాధవ్ తెలిపారు.
By February 09, 2020 at 11:22AM
No comments