Breaking News

జగన్ సర్కార్ ఎఫెక్ట్.. కర్ణాటకలో అదే డిమాండ్.. బంద్‌‌తో ఉద్రిక్తత


కర్ణాటకపై జగన్ సర్కార్ తీసుకున్న ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్‌తో అక్కడ బంద్ కొనసాగుతోంది. కర్ణాటక రక్షణ వేదికె(KRV)ఆధ్వర్యంలో బంద్‌‌కు పిలుపునివ్వగా.. పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ను అమ‌లు చేయాల‌ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంద్ పిలుపుతో మంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫరంగిపేట దగ్గర ఓ బ‌స్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తిరుప‌తి నుంచి మంగుళూరు వెళ్తున్న బ‌స్సును ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రాళ్ల దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బంద్‌కు ఆటో యూనియన్స్,క్యాబ్ యూనియన్స్ కూడా మద్దతు తెలిపాయి. మంగళూరుతో పాటూ బెంగళూరు మరికొన్ని ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. బెంగళూరులో భారీ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే సీపీ మాత్రం ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని చెబుతున్నారు. బంద్ పిలుపుతో కర్ణాటక యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. బంద్‌కు పిలుపునిచ్చిన సంస్థలు శాంతియుతంగా నిరసనలు తెలపాలని ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉంట నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కర్ణాటక సీఎం య‌డియూర‌ప్ప చెబుతున్నారు. ఏంటీ స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ కర్ణాటక ప్రభుత్వం మాజీ కేంద్రమంత్రి సరోజినీ బిందురావ్ మహిషి అధ్యక్షతన 1984లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ఈ కమిటీ నివేదికను సమర్పించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్-సీ,గ్రూప్-డీ ఉద్యోగాలు 100శాతం కర్ణాటకవాళ్లకే ఇవ్వాలని సూచించింది. గ్రూప్ ఏ,గ్రూప్ బీ ఉద్యోగాల్లో గరిష్టంగా 80శాతం.. కనీసం 60 శాతం ఉద్యోగాలను ఇవ్వాలని పేర్కొంది. ఆ కమిటీ సూచనల్ని అమలు చేయాలని.. ప్రైవేట్ సెక్టార్‌లోనూ 75శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.


By February 13, 2020 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bandh-continue-in-karnataka-for-demanding-implementation-of-sarojini-mahishi-report/articleshow/74111333.cms

No comments