Breaking News

కరెన్సీ నోట్లతోనూ కరోనా ముప్పు.. పాతవి గొడౌన్లకు తరలిస్తోన్న చైనా!


తుమ్మినా, దగ్గినా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, బాధితుడి నోటి నుంచి వచ్చిన సూక్షజీవులు ఆరు మీటర్ల దూరం వరకూ వ్యాపిస్తాయి. అయితే, కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం చైనాలో జోరుగా సాగుతోంది. కరెన్సీ ఒకరి నుంచి మరొకరికి చేతులు మారినప్పుడూ కొవిడ్‌-19 వ్యాపిస్తుందనే భయం చైనావాసులను వెంటాడుతోంది. కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కరెన్సీ నోట్లపై ఆంక్షలు మొదలయ్యాయి. కరెన్సీని తగ్గించి, ఇ-కామర్స్‌, నెట్‌ బ్యాంకింగ్‌‌లను వాడుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచించడం విశేషం. కరోనా వైరస్ జీవిత కాలం 9 రోజుల వరకు మరొకరికి సంక్రమించగలిగే స్థితిలో ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. హాస్పిటల్స్, ఆఫీసులు, బ్యాంకుల్లో ఎక్కువ మంది చేతులు వేసే తలుపు గడియలు, టేబుళ్లు లాంటి ద్వారా వైరస్‌ వేగంగా ఇతరులకు సోకుతుందని పేర్కొంటున్నారు. కొవిడ్‌-19ను నిరోధించడానికి అనేక చర్యలు చేపడుతున్నారు. కరెన్సీ నోట్లను తాకడం వల్ల కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందనే ఉద్దేశంతో భారీ ఎత్తున నోట్లను సేకరించి, గొడౌన్లకు తరలిస్తున్నారు. అలాగే, కరెన్సీని ఖాతాదారులకు అందజేసేటప్పుడు వైరస్‌ లేకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే సమయంలో కొరత లేకుండా చూడాలని పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు, ఆన్‌లైన్‌ సేవలను మరింత వినియోగించుకోవాలని కోరింది. వీటితోపాటు 600 బిలియన్ల యూన్ (85.9 బిలియన్ డాలర్ల) కొత్త కరెన్సీ నోట్లను హుబే ప్రావిన్సులకు తరలించింది. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లోని సరఫరా చేయడానికి ముందు పాత నోట్లను కనీసం 14 రోజుల పాటు అతినీలలోహిత కిరణాలు లేదా వేడిచేయడం ద్వారా శుభ్రం చేయనున్నట్టు పీబీసీ వెల్లడించింది. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థల మధ్య కరెన్సీ లావాదేవీలను నిలిపివేశారు. వుహాన్‌లోని హాస్పిటల్స్‌లోని రోగులకు సేవలు అందజేయడానికి రోబోలను రంగంలో దించారు. చైనాలోని అన్ని ప్రాంతాల నుంచి 25 వేల మందికి పైగా వైద్యుల్ని హుబెయ్‌ ప్రావిన్సుకు పంపించారు. వుహాన్ సహా కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు పాత నోట్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు, రెండు వారాల పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనల్ని నిషేధిస్తున్నట్టు హాంకాంగ్‌ కార్డినల్‌ ప్రకటించింది. చర్చిలకు వెళ్లేవారు ఆన్‌లైన్‌లో ప్రార్థనల్ని వీక్షించాలని పేర్కొంది. ప్రార్థనా స్థలాలకు వచ్చేవారు కరచాలనం చేసుకోవద్దని ఫిలిప్పీన్స్‌లోని ఓ చర్చి ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ ముఖ భాగాల నుంచి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున చేతులతో ముఖాన్ని తాకవద్దని సింగపూర్‌ మంత్రి లారెన్స్‌ వాంగ్‌ సూచించారు.


By February 16, 2020 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-quarantines-cash-to-sanitize-old-money-to-reduce-contagion-risks-of-coronavirus/articleshow/74157379.cms

No comments