Breaking News

ఢిల్లీలో కోడ్ ఉల్లంఘనపై మాజీ సీఈసీ వ్యాఖ్యలు.. ఆయనకు అమ్నీషియా ఉందంటూ ఈసీ కౌంటర్


కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ)పై మాజీ ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదంటూ ఖురేషీ ప్రశ్నించగా, ఆయనకు ‘సెలెక్టివ్ అమ్నీషియా’ఉందంటూ ఈసీ కౌంటర్ ఇచ్చింది. ఎస్‌వై ఖురేషి 2010 నుంచి 12 మధ్య ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 8న ఓ పత్రికలో వ్యాసం రాసిన ఖురేషీ ఢిల్లీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనపై వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లఘించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదు.. ఎన్నికల ప్రచారంలో రెచ్చగొటే వ్యాఖ్యలు చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం లేదా ఐపీపీ సెక్షన్ 153 కింద కేసు నమోదుచేసి, ఆర్పీ చట్టం 123, 125 ప్రకారం రుజువైతే శిక్షార్హం.. ఢిల్లీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించిన బీజేపీ నేతలను స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తొలగించి, తాత్కాలికంగా వారిపై నిషేధం విధించడం అభినందనీయం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఈసీ.. ఫిబ్రవరి 13న సమాధానం ఇచ్చింది. ఖురేషీ కాలంలో చేపట్టిన మోడల్ కోడ్ ఉల్లంఘన చర్యలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ రికార్డు చేశారు. అంతేకాదు, ఐపీసీ 1860 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951/ 153లోని సెక్షన్లు 123, 125 కింద ఆయన హయాంలో నాటి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కావాలంటే ఈ జాబితా చూడవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సాక్ష్యాలుగా జులై 30, 2010 నుంచి జూన్ 10, 2012 వరకు మధ్య పలు సందర్భాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన తొమ్మిది షోకాజ్ నోటీసులను ఉదాహరణగా చూపారు. ‘కోడ్ ఉల్లంఘించినవారికి ఉత్తరప్రదేశ్ 2012 ఎన్నికల్లో ఐదు, 2011 పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో మూడు, తమిళనాడు ఎన్నికల్లో రెండు, బీహార్ ఎన్నికల్లో ఒక నోటీసు జారచేయగా, ఈ కేసుల్లో ఐదింటికి సలహాదారులు నోటీసు జారీ చేయగా, రెండింటికి హెచ్చరికలు జారీ చేశారు. మిగితా రెండు కేసులను మూసివేశారని, ఏ కేసుల్లోనూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయలేదని’ వివరించారు. అలాగే, అసోం, కేరళ, పుదుచ్చేరి, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఆదేశాలు జారీచేయలేదని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మైనార్టీలకు 9 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు నాటి కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించినందుకు నోటీసులు జారీచేసిన ఈసీ, ఆ తర్వాత దానిని వెనక్కుతీసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్ లేఖ రాయడంతో రిజర్వేషన్ల విషయంలో తన ప్రకటనను వెనక్కుతీసుకుంటున్నానని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఖుర్షీద్ ప్రకటించారు. అలాగే, 2012 ఎన్నికల్లో బీఎస్పీ నేత ఎస్‌సీ మిశ్రా చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని భావించి ఈసీ నోటీసు జారీచేసింది.. కానీ ఆయన వివరణ ఇవ్వలేదన్నారు. అలాగే కోడ్ ఉల్లంఘించిన నాటి కేంద్ర మంత్రులు బేణీ ప్రసాద్ వర్మ, శ్రీప్రకాశ్ జైస్వాల్‌ కూడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా నోటీసులతోనే సరిపెట్టారన్నారు. పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఉద్దేశించి సీపీఏం నేత అనిల్ బసు వ్యాఖ్యలు చేస్తే, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈసీ కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టింది. బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై జేడీయూ నేత శరద్ యాదవ్, తమిళనాడులో జయలలితపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోలేదని సందీప్ సక్సేనా గుర్తుచేశారు.


By February 15, 2020 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-cec-sy-quraishi-comments-on-ec-due-to-fir-not-filing-hate-speeches-in-delhi-election/articleshow/74145295.cms

No comments