చైనాలో మరింత ఉద్ధృతంగా కరోనా.. నిన్న ఒక్కరోజే 73 మంది మృతి
చైనాలో రక్కసి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ వైరస్ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 563కు చేరింది. బుధవారం ఒక్క రోజే 73 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని, దీనిని ఎదుర్కొడానికి అన్ని దేశాలూ మరిన్ని నిధులు కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరోవైపు, ప్రయాణికులతో వెళ్తున్న రెండు నౌకలను జపాన్, హాంకాంగ్ తీరంలో నిలిపివేశారు. ఈ రెండు నౌకల్లోని మొత్తం 5,400 మంది ప్రయాణికులను అదుపులో ఉంచి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. యకహోమా తీరంలోని నౌకలో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి కరోనా వైరస్ సోకినట్టు మంగళవారం నిర్ధారణ కాగా, అందులోని మరో 10 మందిలోనూ పాజిటివ్‌గా వచ్చినట్టు పేర్కొన్నారు. వీరిని తదుపరి పరీక్షల కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. ఈ నౌకలో మొత్తం 3,700 మంది ఉండగా, రెండు వారాల పాటు వీరిని క్యాబిన్‌లో ఉంచి పర్యవేక్షిస్తారు. ఈ నౌకలో 2,666 మంది ప్రయాణికులు, 1,045 మంది సిబ్బంది ఉన్నారు. నౌకలోని మరో 170 మంది ప్రయాణికుల నమూనాలను పరీక్షలకు పంపగా, వాటి నివేదికలు ఇంకా అందలేదు. కరోనా వైరస్ బారినపడి దేశాలకు సాయం చేయడానికి 675 మిలియన్ డాలర్లు అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నోమ్ ఘేబ్రియాసస్ పేర్కొన్నారు. ఈ మొత్తం చాలా ఎక్కువే అయినా, వైరస్‌ను ఎదుర్కొడానికి పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. గడచిన 24 గంటల్లోనే కరోనా వైరస్ కేసులు రెట్టింపయినట్టు గుర్తించామని అన్నారు. గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 3,694 మందికి కొత్తగా ఈ వైరస్ సోకిందని, మొత్తం 28,018 కేసులు నమోదయ్యాయని తెలిపారు. చైనా బయట కనీసం 230 కేసులు నమోదు కాగా, హాంకాంగ్‌లో ఒకరు, ఫిలిప్పైన్స్‌లో ఒకరు చనిపోయారు. కరోనా వైరస్‌ను నియంత్రణకు గట్టి చర్యలను తీసుకుంటు్న చైనా.. ఇతర దేశాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని పిలుపునిచ్చింది. అంటువ్యాధి పరిస్థితిపై హేతుబద్ధమైన రీతిలో అంచనా వేస్తూ, డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సులను స్వీకరిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చెనింగ్ వెల్లడించారు. మరోవైపు, చైనాతో పూర్తిగా సరిహద్దులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ హాంకాంగ్ హాస్పిటల్స్‌లో పనిచేసే వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు.
By February 06, 2020 at 09:55AM
No comments