Breaking News

అహ్మదాబాద్‌లో ట్రంప్ ఉండేది మూడు గంటలే.. ఖర్చు మాత్రం రూ. 100 కోట్లు!


అమెరికా అధ్యక్షుడు తొలిసారి భారత్ పర్యటనకు విచ్చేస్తుండగా ఆయనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకనుంది. ట్రంప్ రెండు రోజుల పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ రోడ్‌షోలో పాల్గొంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకూ రోడ్‌ షో జరగనుండగా, ఈ మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దతున్నారు. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో సభను నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి స్టేడియం వరకు దారి పొడవునా ఇరువైపులా ఐదు నుంచి ఏడు మిలియన్ల మంది జనం నిలబడి ట్రంప్‌నకు స్వాగతం పలుకుతారని తెలుస్తోంది. అహ్మదాబాద్‌లో ట్రంప్ మూడు గంటలపాటు గడపనుండగా ఇందుకు గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల ఖర్చుచేస్తోంది. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యం ఇవ్వడంలో బడ్జెట్ గురించి ఆలోచించవద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ హామీ ఇచ్చినట్టు ట్రంప్ పర్యటన ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్న ఉన్నత వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏయూడీఏ) సంయుక్తంగా రహదారులు మరమత్తులు, నగరంలో సుందరీకరణ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మోతేరా స్టేడియం ప్రారంభించిన తరువాత ట్రంప్ తిరిగి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలోని 17 రహదారులు, కొత్తగా ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు వేయడానికి రూ .60 కోట్లు ఖర్చవుతోంది. అలాగే రోడ్‌షో మార్గంలో సుందరీకరణకు రూ.6 కోట్లు, రోడ్ల కోసం రూ.20 కోట్లను ఏయూడీఏ వెచ్చిస్తోంది. ట్రంప్ పర్యటన కోసం అయిన మొత్తం వ్యయాన్ని తర్వాత లెక్కించనున్నారు. అయితే, రూ.100 కోట్ల పైగా ఖర్చు అవుతుండగా, కొంత కేంద్రం భరించనుంది. మెజారిటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే ఖర్చవుతోంది. ట్రంప్ పర్యటనకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తిచేయాలని, నిధుల కారణంగా ఎలాంటి జాప్యం జరగరాదని అన్ని విభాగాలకూ ప్రభుత్వ అనుమతులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ నగరంలోని రహదారుల మరమత్తుల కోసం ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినట్టు ఏఎంసీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మోతేరా స్టేడియం, సబర్మతి ఆశ్రమయం, విమానాశ్రయం మార్గాల్లో రహదారుల కోసం నిధులు మంజూరుచేసినట్టు తెలిపారు.


By February 15, 2020 at 12:44PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-president-donald-trumps-three-hour-gujarat-visit-set-to-cost-over-rs-100-crore/articleshow/74146675.cms

No comments