Breaking News

Iran US War ఉక్రెయిన విమానం మేమే కూల్చేశాం.. మానవతప్పిదం వల్లే జరిగింది: ఇరాన్ ప్రకటన


నాలుగు రోజుల కిందట టెహ్రాన్‌లో కూలి 176 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. సాంకేతికలోపం వల్ల విమానం కూలిపోలేదని, ఇరాన్ క్షిపణులే కూల్చేసినట్టు తేలింది. తాజాగా, ఈ విషయాన్ని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఉక్రెయిన్ విమానం కూలిపోవడానికి తమ క్షిపణులే కారణమని ఇరాన్ శనివారం వెల్లడించింది. అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, మానవ తప్పిదం వల్లే జరిగిందని ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ జనరల్ ప్రకటించారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొద్ది గంటల్లోనే ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కి టెహ్రాన్ విమానాశ్రయం నుంచి 167 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో బోయింగ్ 737 విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానం గాల్లో ఉండగానే మంటలు అంటుకోవడంతో అందులోని 176 మంది చనిపోయారు. విమానంలో ఇరాన్ పౌరులు 82 మంది, కెనడా పౌరులు 63 మంది, 11 మంది ఉక్రెయిన్, నలుగురు అఫ్గన్, పది మంది స్విట్జర్లాండ్, జర్మనీ, బ్రిటన్‌ పౌరులు ముగ్గురు చొప్పున ఉన్నారు. విమాన ప్రమాదంపై ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ ట్విట్టర్‌లో స్పందించారు.. ‘ఇదో విచారకరమైన రోజు.. ఉక్రెయిన్ విమానం మానవ తప్పిదం వల్ల కూలిపోయినట్టు సాయుధ దళాల అంతర్గత విచారణలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాం.. అమెరికా దుస్సాహసం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’అని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ప్రమాద స్థలి నుంచి విమానం శకలాలను స్వాధీనం చేసుకుని, బాధితులను గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధిపతి అలీ అబేద్జాద్ తెలియజేశారు. మరోవైపు, విమానాన్ని క్షిపణులే కూల్చేశాయని బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రధానులు రెండు రోజుల కిందటే ప్రకటించారు. అమెరికా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.


By January 11, 2020 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iran-officially-announced-it-military-unintentionally-shot-down-ukrainian-jet/articleshow/73199427.cms

No comments