Breaking News

‘సరిలేరు నీకెవ్వరు’ ట్విట్టర్ రివ్యూ: పర్ఫెక్ట్ పొంగల్ బొమ్మ


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తరవాత రీఎంట్రీ ఇస్తోన్న సినిమా ఇది. దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 11న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల ప్రత్యేక షోలు పడిపోయాయి. అలాగే, యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. ఆయా ప్రాంతాల్లో సినిమా చూసిన మహేష్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పర్ఫెక్ట్ పొంగల్ బొమ్మ అని చెబుతున్నారు. మహేష్ బాబును ఎలా చూడాలనుకున్నామో అంతకన్నా గొప్పగా దర్శకుడు అనిల్ రావిపూడి చూపించారంటూ కొనియాడుతున్నారు. మొత్తానికి ఫ్యాన్స్‌కి ఇది ఫుల్స్ మీల్స్ లాంటి సినిమా అని అంటున్నారు. ఓవరాల్‌గా అందరూ ఇస్తోన్న రివ్యూల ప్రకారం చూసినా ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్టు కొట్టేసినట్టే. చాలా వరకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదొక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ అంటున్నారు. ఫస్టాఫ్‌లో ట్రైన్ ఎపిసోడ్ బాగా నవ్విస్తుందట. ఈ ఎపిసోడ్‌లో మహేష్ బాబు యాక్షన్ చాలా ఎనర్జిటిక్‌గా ఉందంటున్నారు. ప్రకాష్ రాజ్ ఎంట్రీ సీన్ అయితే నాన్ స్టాప్ కామెడీ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఫస్టాఫ్‌లో ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ మొత్తం చూపించేశారట. ఇక సినిమాకు కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని టాక్. ‘ఒక్కడు’ రేంజ్‌లో ఉండట. అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదించిందని టాక్. చాలా సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయట. అంతేకాకుండా కామెడీని బలవంతంగా రుద్దినట్టు ఉందని అంటున్నారు. ప్రీక్లైమాక్స్‌లో వేగం పెరిగినట్టు అనిపించినా క్లైమాక్స్ చాలా చప్పగా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. కథ కూడా ఏమీలేదని చెబుతున్నారు. కామెడీ, యాక్షన్ సీన్స్‌తో సినిమాను నడిపించేశారని టాక్. విజయశాంతి నటన అద్భుతంగా ఉన్నా రష్మిక మందన నటన కాస్త అతి అనిపిస్తుందని కొంత మంది అభిప్రాయం. మొత్తంగా చూసుకుంటే ఒక మంచి మాస్ ఎంటర్‌టైనర్‌ను చూపిన ఫీలింగ్ అయితే కలుగుతుందని అంటున్నారు. మహేష్ ఫ్యాన్స్‌కి అయితే విందు భోజనం లాంటి సినిమా అట. సినిమాలో అనిల్ రావిపూడి రాసిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఒక్క మూడు నెలలు అర్మీలో పని చేస్తే నేను అనే ఫీలింగ్ పోయి నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది’’ అనే డైలాగ్‌ను రాంజీ ట్వీట్ చేశారు. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మహేష్ డ్యాన్స్. చాలా కొత్తగా ఇరగదీశారట. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్‌లో తన స్టెప్పులతో అదరగొట్టారట. దేవీశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్‌ట్రార్డినరీ అంటున్నారు.


By January 11, 2020 at 05:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-sarileru-neekevvaru-audience-talk-and-public-response/articleshow/73197437.cms

No comments