శరణార్ధుల పడవ మునక.. 8 మంది చిన్నారులు సహా 11 మంది మృతి
టర్కీలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వలసదారులతో వెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి చెందగా, వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటన పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో చోటుచేసుకున్నట్లు కోస్టు గార్డ్ వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించారు. జరిగిన సమాచారం తెలుసుకున్న టర్కీ కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగింది. గతేడాది జూన్‌లో గ్రీస్ దేశానికి వలసవాదులు వెళ్తున్న ఓ పడవ.. ఈజియన్ తీరంలోనే మునిగిపోయి 12 మంది చనిపోయారు. మధ్య ఆసియా, ఆఫ్రికాలలో నెలకున్న పరిస్థితులు, అంతర్యుద్ధాలు, పేదరికంతో ఐరోపా దేశాలకు వలసల తాకిడి పెరిగింది. వీటిలో శరణార్ధులకు టర్కీ ముఖ్య కేంద్రంగా మారింది. 2015 నుంచి ఆ దేశానికి శరణార్ధులు భారీగా వస్తున్నారు. 80 శాతం మంది శరణార్థులు అభివృద్ధి చెందుతున్న, నిరుపేద దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రాథమిక అవసరాల కొరతతో ఇబ్బందిపడుతున్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న అనేక దేశాలు పౌరసత్వం ఇచ్చేందుకు ససేమిరా నిరాకరిస్తున్నాయి. పలు దేశాల్లో శరణార్థులు దినసరి కూలీలుగా అవతారమెత్తారు. చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ఇబ్బందిపడుతున్నారు. మొత్తం 30లక్షల మంది శరణార్థులకు టర్కీ ఆశ్రయం కల్పిస్తుంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం చెలరేగి, పరిస్థితి భయానకంగా మారడంతో వలసవస్తున్న శరణార్థులను ఆ దేశం ఆదుకుంది. టర్కీలో ఆశ్రయం పొందుతున్న శరణార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ... సిరియా సరిహద్దులో డీమిలిటరైజ్డ్ జోన్ ఏర్పాటు కోసం కృషి చేస్తుంది. వలసదారులను అక్కున చేర్చుకునేందుకు టర్కీ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. 2018 డిసెంబర్31 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 71 మిలియన్ల మంది వలసదారులుగా మారిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.
By January 12, 2020 at 08:47AM
No comments