Breaking News

సమయం లైవ్ న్యూస్: బాబుకు సన్నిహితుడైన ఆఫీసర్‌పై వేటు.. రణరంగమైన అసోం


⍟ క్యాబ్‌పై భగ్గుమన్న అసోం: కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. మరోవైపు, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో జనం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసోం, త్రిపురలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా అసోంలో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్నారు. ⍟ క్యాబ్ 2019కి రాష్ట్రపతి ఆమోదం: పౌరసత్వ చట్ట (సవరణ) బిల్లు 2019కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పౌరసత్వ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం అధికారిక గెజిట్ విడుదల చేయడంతో చట్టంగా అమల్లోకి వచ్చింది. తాజా చట్టం ప్రకారం... 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌లో మతపరమైన హింసను ఎదుర్కొని దేశంలోకి వచ్చిన వారికి భారత పౌరసత్వం లభించనుంది. ⍟వైసీపీ ఎమ్మెల్యేపై అమిత్ షాకు ఫిర్యాదు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆగడాలు పెరిగిపోయాయంటూ కేంద్ర హోంమంత్రికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ అమిత్ షాను కలిశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు అరాచకాలు పెరిగిపోయాయని, తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆ పార్టీ నేత కోలా ఆనంద్ కుమార్ ఫిర్యాదు చేశారు. ⍟ దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. సుప్రీం కీలక ఆదేశాలు: దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మృతదేహాలను భద్రపరచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. ⍟ బాబుకు ఆప్తుడైన అధికారిపై వేటు: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌‌ను జగన్ సర్కారు విధుల నుంచి సస్పెండ్ చేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆయన ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది.


By December 13, 2019 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-13th-december-2019/articleshow/72500626.cms

No comments