Breaking News

వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న 264 మంది మత్స్యకారులు.. రంగంలోకి ఐసీజీ


అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న 264 మంది జాలర్లను సిబ్బంది రక్షించారు. డిసెంబరు 3న చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో కల్లోలం వల్ల అక్కడ చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల సంఘం ఇచ్చిన సమాచారంతో ఇండియన్‌ కోస్టు గార్డు రంగంలోకి దిగింది. మోటారు బోట్ల సాయంతో వారిని సురక్షితంగా తీరానికి చేర్చింది. మొత్తం 50 పడవల్లో వెళ్లిన మత్స్యకారులు 264 మంది మత్స్యకారులు పశ్చిమ గోవాకు 250 నాటికల్ మైల్స్ దూరంలోని అరేబియాలో చిక్కుకున్నారని సమాచారం రావడంతో కోస్ట్‌గార్డ్ సిబ్బంది మొత్తం ఏడు మోటారు బోట్లతో అక్కడకు చేరుకున్నారు. ఇండియన్ మర్చెంట్ షిప్ నవ్‌ధేను పూర్ణ 86 మంది మత్స్యకారులను, జపాన్‌కు చెందిన ఎంవీ తోవ్డాలో 34 మంది తరలించారు. కోస్ట్‌గార్డ్స్ నుంచి వచ్చిన విన్నపంతో మారీటైమ్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ సెంటర్ ఐదు భారీ పడవలను పంపింది. దీంతో మొత్తం 264 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారికి ప్రథమ చికిత్స నిర్వహించి ఆహారం అందజేశారు. ఆరోగ్యం పరీక్షల నిర్వహణ అనంతరం వారిని స్వస్థలాలకు పంపినట్టు అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తెలిపింది. అయినా వీటిని పట్టించుకోకుండా వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. డిసెంబరు 3 వరకు కేరళ, లక్షద్వీప్ ప్రభుత్వాలు చేపల వేటపై నిషేధం విధించాయి. కాగా, ప్రమాద సమయంలో రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఇండియన్ కోస్ట్‌గార్డ్ వద్ద సముద్ర ప్రహరీ, సమర్, సావిత్రీబాయ్ ఫూలే, అమల్, అపూర్వ నౌకలు సిద్ధంగా ఉంటాయి. వీటికి తోడు డోర్నియర్ యుద్ధ విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది నౌకలు, మూడు విమానాలు నిరంతరం తీర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నాయి.


By December 05, 2019 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-coast-guards-rescue-264-distressed-fishermen-in-arabian-sea/articleshow/72378202.cms

No comments