Breaking News

మహాపంచాయితీపై నేడు సుప్రీం నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ


మహారాష్ట్ర పంచాయతీపై సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని 24 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదివారం అత్యవసర విచారణ చేపట్టింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో తెలిపే లేఖలను సోమవారం ఉదయం 10.30 గంటలకు సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని పరిశీలించాకే తదుపరి ఉత్తర్వులు జారీచేస్తామని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను ఆహ్వానించిన గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన సహా పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలనూ పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన మహావికాస్‌ అఘాడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలన్న అభ్యర్థనను ప్రస్తుతానికి పరిశీలనలోకి తీసుకోవడంలేదని తెలిపింది. దీంతో నేడు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనే సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. మరోవైపు, మొత్తం 154 మంది ఎమ్మెల్యే పేర్లతో కూడిన అఫిడ్‌విట్‌ను కాంగ్రెస్-ఎన్‌సీపీ- శివసేన కూటమి సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, తమకు 154 మంది ఉన్నారని మహావికాస్ అఘాడీ పేర్కొంది. శివసేన 56, కాంగ్రెస్ 44, ఎన్‌సీపీ 46, 8 మంది స్వతంత్రులు సంతకాలుచేసిన అఫిడ్‌విట్‌ను సమర్పిస్తామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలిపారు. తమకు అవకాశం ఇస్తే తక్షణమే బలం నిరూపించుకుంటామని, ఫడ్నవీస్‌కు మెజార్టీలేదని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో బలపరీక్షను నిర్వహించాలని కూటమి కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


By November 25, 2019 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-to-hear-sena-ncp-congress-plea-against-bjp-at-1030am-today/articleshow/72216967.cms

No comments