అన్నా అధికారం వస్తుంది, పోతుంది.. బంధాలు శాశ్వతం: పవార్ కుమార్తె ఉద్వేగభరిత విన్నపం

మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపాయి. బీజేపీ వేసిన పాచికతో పవార్ కుటుంబంలో చీలిక ఏర్పడింది. ఎన్‌సీపీ అధినేత, తన బాబాయిని కాదని బీజేపీకి మద్దతు తెలపడంతో కుటుంబసభ్యులు ఖిన్నులయ్యారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ కుమార్తె తన సోదరుడు అజిత్ పవార్‌ను ఉద్దేశించి చేసి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదవి వస్తుంది.. పోతుంది.. బంధాలు మాత్రమే శాశ్వతం అంటూ సుప్రియా ఉద్వేగభరిత ట్వీట్ చేశారు. శనివారం జరిగిన నాటకీయ పరిణామాలపై సుప్రియా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నా జీవితంలో ఇంతటి ద్రోహాన్ని చూడలేదని.. ఎవరినైతే కాపాడామో వారే మోసం చేశారని, జీవితంలో ఎవర్ని నమ్మాలో అర్ధం కావడంలేదని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఇది తన జీవితంలో క్లిష్టమైన రోజుల్లో ఒకటని అన్ని అన్నారు. ఇది తమ కుటుంబానికి అత్యంత క్లిష్ట సమయం... కానీ, ఈ సమయంలో చాలా మంది ప్రజలు మద్దతుగా నిలిచారు.. కష్టకాలంలో తమ వెన్నంటి ఉన్నవారికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. తన సోదరుడు అజిత్ పవార్‌ను వెనక్కు రప్పించడానికి అధినాయకత్వం దృష్టిసారించిందని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి పోరాటంపై సుప్రియా ప్రశంసలు కురిపించారు. ‘ఆయన విజయం సాధించినా, ఓడిపోయినా నిజమైన మరాఠా యోధుడిలో పోరాటం చేస్తున్నారు.. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా మోదీ- అమిత్ షా క్రూరమైన శక్తివంతులు, కుటుంబంలోని దేశద్రోహులతో ఆయన యుద్ధం చేస్తున్నారు.. ఇలాంటి సంకల్పం తాను ఎప్పుడూ చూడలేదు’ అని సుప్రియా వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రజలకు ఇంకా మంచి సేవ చేస్తామని నమ్మకం ఉందని, నిజాయితీ, కృషి ఎప్పుడూ వృథాకావు.. కానీ ఆ మార్గం కష్టమైనా దీర్ఘకాలికంగా కొనసాగుతుందున్నారు. శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ సైతం అజిత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విన్నవించాడు.
By November 25, 2019 at 10:48AM
No comments