Breaking News

బలనిరూపణకు వారం రోజుల గడువు.. 170 మంది మద్దతు ఉందన్న బీజేపీ


ఎన్నికల ఫలితాల తర్వాత థ్రిల్లర్ సినిమాను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఊహించని రీతిలో ఎన్‌సీపీలో చీలిక తీసుకొచ్చి అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ వారం రోజులు గడువు ఇచ్చారు. నవంబరు 30లోగా బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ఇక, ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీజేపీ, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామనే ధీమా వ్యక్తం చేసింది. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతిస్తున్నట్లు గవర్నర్‌కు అజిత్‌ పవార్‌ లేఖ ఇచ్చారని బీజేపీ వెల్లడించింది. ప్రస్తుతం ఎన్‌సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా అజిత్‌ పవార్‌ ఉన్నారని, ఆయన లేఖ ఇచ్చినందున ఆ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని బీజేపీ అంటోంది. కానీ, బీజేపీకి మద్దతు విషయం అజిత్‌ పవార్‌ వ్యక్తిగతమని, పార్టీతో సంబంధం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. దీంతో ఆయన వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న సందిగ్దత నెలకుంది. అజిత్ నిర్ణయం వ్యక్తిగతమని శరద్‌ ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఎన్సీపీలో చీలిక వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అజిత్‌ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని తన అనుకూల ఎమ్మెల్యేలతో ముందుకు సాగినట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేనకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా, అజిత్ నిర్ణయంపై శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. పవార్ కుటుంబం, ఎన్సీపీ చీలిపోయింది.. నా జీవితంలో ఇంతటి ద్రోహాన్ని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినైతే కాపాడామో వారే మోసం చేశారని, జీవితంలో ఎవర్ని నమ్మాలో అర్ధం కావడంలేదని సుప్రియా వ్యాఖ్యానించారు.


By November 23, 2019 at 12:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-governor-gives-time-for-floor-test-before-november-30th/articleshow/72195493.cms

No comments