Breaking News

Sye Raa: సైరా జగన్మోహన్ రెడ్డి.. మెగా ఫ్యాన్స్ ఫిదా.. రాజకీయమంటే ఇదే!


తెలుగునాట ఇప్పుడు ఏ నోట విన్నా ‘సైరా’ మాటే. చిరంజీవి నటించిన చారిత్రక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో.. ఈ మూవీకి భారీగా హైప్ వచ్చింది. ఆరు పదుల వయసులోనూ ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో శ్రమించారు. అలాంటి సినిమాకు జగన్ మంచి గిఫ్ట్ ఇచ్చారు. అదనపు షోలు వేయడం కోసం ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. దీంతో రోజుకు ఆరుకుపైగా షోలు వేసుకునే అవకాశం లభించినట్టే. జగన్ సర్కారు అనుమతి ఇవ్వడంతో.. సినిమా తొలి వారంలో భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ‘సైరా’ అదనపు షోలకు జగన్ సర్కారు అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. మెగా ఫ్యామిలీ పట్ల జగన్ ఒకింత అసహనంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. చిరంజీవి పట్ల ఆయనకు ఎలాంటి కోపం లేకపోయినప్పటికీ.. ఆయన కుమారుడు రామ్ చరణ్ గతంలో చేసిన కామెంట్లు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా తనను టార్గెట్ చేస్తుండటమే దీనికి కారణమని భావించారు. కానీ జగన్ మాత్రం ‘సైరా’ పట్ల సానుకూలంగా స్పందించారు. రాయలసీమ పాలెగాండ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అదే ప్రాంతానికి చెందిన జగన్.. అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. తద్వారా చిరంజీవిపై, మెగా ఫ్యామిలీపై తనకేమీ వ్యతిరేక భావన లేదని చాటారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాజకీయాలు వేరే, సినిమా వేరే అనేలా మాత్రమే కాకుండా.. సీఎం హోదాలో ఉన్న తాను అన్ని వర్గాలను సమంగా చూస్తానని ఈ నిర్ణయంతో జగన్ సంకేతాలు పంపారు. రాజకీయంగానూ ఈ నిర్ణయం జగన్‌కు ఉపకరించే అవకాశం ఉంది. సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే.. జగన్‌పై విమర్శలు గుప్పించే వారు. కానీ ఆయన ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ విషయంలో జగన్ చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరించారు. ఇంకోలా చెప్పాలంటే తన తండ్రి వైఎస్ రాజకీయాన్ని గుర్తుకు తెచ్చారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జగన్‌కు చెందిన సాక్షి పేపర్లో కనీసం పవన్ కళ్యాణ్ ఫొటో వేయడానికి కూడా ఇష్టపడరు. కానీ చిరంజీవి ఫుల్ పేజీ ఇంటర్వ్యూలను అదే పేపర్లో చూశాం. మరి పవన్ పట్ల కూడా జగన్, ఆయన మీడియా వైఖరి మారుతుందా? లేదంటే ఈ మినహాయింపులు చిరంజీవికి మాత్రమేనా? చూడాలి.


By October 02, 2019 at 10:32AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/mega-fans-happy-with-ys-jagan-govt-decision-to-give-permission-to-extra-shows-to-sye-raa-narasimha-reddy-movie/articleshow/71403515.cms

No comments