Janasenaకు షాకిస్తోన్న నేతలు.. పవన్‌ను కలవాలంటే ఆయన పర్మిషన్, ఆ ఇద్దరి వల్లే ఈ పరిస్థితి?
పార్టీ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి జనసేన నేతలు ఇతర పార్టీలకు వెళ్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, బీజేపీ వైపు జనసేన నేతలు చూస్తున్నారు. నేతలు పార్టీకి దూరం అవుతున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే జనసేన ఖాళీ అవుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు జనసేనకు గుడ్ బై చెప్పారు. నేతలు వరుసగా జనసేన పార్టీని వీడటానికి కారణం పవన్ చుట్టూ ఉన్న కోటరీనే అని తెలుస్తోంది. ఒకరిద్దరు వ్యక్తుల కారణంగానే జనసేనకు నేతలు గుడ్ బై చెబుతున్నారని చెప్పారు. ‘‘నాయకుడి బలం మేరు పర్వతం.. సైనికబలం అద్వితీయం. కానీ మేరుపర్వతంలో చిట్టెలుక దూరింది’’ అని పవన్ కోటరీని ఉద్దేశించి జనసేన జెండాను ఇప్పటికీ మోస్తున్న ఓ నేత ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టెలుకను తరమాలంటే పొగబెట్టాల్సిందేనన్నారు. ఆ చిట్టెలుక ఎవరనేది ఇటీవలే జనసేనను వదిలి బీజేపీలో చేరిన చింతల పార్థసారథి పరోక్షంగా తెలిపారు. తాను జనసేనను వదిలి వేరే పార్టీకి వెళ్లాల్సి వస్తోందని అనుకోలేదని చింతల పార్థసారథి తెలిపారు. తనకు చిరు కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్నారు. ఐఆర్ఎస్ ఆఫీసరుగా 13 ఏళ్ల సర్వీస్ వదులుకొని కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అనకాపల్లిలో ఓడిపోతానని తెలిసినా సరే.. తాను పోటీ చేశానన్నారు. 2019లో గెలవలేకపోయినా 2024 కోసం తాము కష్టపడ్డామన్నారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో తాను లక్ష కిలోమీటర్లు తిరిగానన్నారు. జనసేన పార్టీ 70 నియోజకవర్గాల్లో బలంగా ఉండేదని.. తెలుగుదేశం పార్టీని విమర్శించడం లేదనే భావన జనంలో మొదలైన తర్వాతే పార్టీ బలహీనపడిందని పార్థసారథి తెలిపారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక గురించి ముఖ్య నేతలతో కూడా పవన్ చర్చించలేదని చింతల చెప్పారు. పవన్ కళ్యాణ్ కోటి మంది ప్రజలను కలిస్తే 16 లక్షల ఓట్లే పడ్డాయన్నారు. టీడీపీతో జనసేన లోపాయికార ఒప్పందం చేసుకుందనే భావనే దీనికి కారణమన్నారు. లింగమనేని రమేశ్, నాదెండ్ల మనోహర్‌లు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నప్పటి నుంచే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ టీడీపీ విమర్శలు చేయడం మనేశారని చింతల పార్థసారథి తెలిపారు. లింగమనేని రమేశ్, నాదెండ్ల మనోహర్ చెప్పిన వ్యక్తులకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ‘‘పార్టీ అధ్యక్షుడికి నేను చెప్పాలనుకున్న విషయాలను చెప్పలేకపోయాను, ఆయన్ను కలవలేకపోయాను. ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత కూడా పవన్ అదే తప్పు చేస్తున్నారు. పవన్‌ను ఎవరైనా కలవాలంటే నాదెండ్ల మనోహర్ ద్వారానే కలవాల్సిన పరిస్థితి తలెత్తింది. నేను బీజేపీలో ఉన్నా కూడా పవన్ అభిమానిగానే ఉంటాను. లింగమనేని రమేశ్ కరకట్ట మీద చంద్రబాబుకు ఇంటిని అద్దెకు ఇచ్చాడు. అదే వ్యక్తి దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ ఇంటి కోసం స్థలం కొన్నాడు అని మీడియాలో కథనాలు వచ్చాయి. చంద్రబాబుకు దగ్గరగా ఉన్న వ్యక్తి.. మన దగ్గరకు వచ్చినప్పుడు అనుమానాలు రావడం సహజం. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని సూచించాం. కానీ పవన్ నా సూచనలను అమలు చేయలేద’’ని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆరోపణలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ జనసేనలో ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి లేదని మాత్రం ఆ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసే వారే చెబుతున్న మాట. ఇకనైనా పవన్ కళ్యాణ్ ఆ కోటరీని పక్కనబెట్టారని.. జనసేనలో జవసత్వాలు నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.
By October 08, 2019 at 12:00PM
No comments