Breaking News

GMC Balayogi: బాలయోగి జయంతి.. చంద్రబాబు భావోద్వేగం


దివంగత లోక్‌సభ స్పీకర్ జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత ఆయన సేవలను సర్మించుకున్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడన్న చంద్రబాబు.. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపిందన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ట్విట్ చేశారు. ‘‘కోనసీమలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి లోక్ సభ స్పీకర్ గా ఆ పదవికే వన్నెతెచ్చిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల బంధువు, స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగిగారి జయంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నాన’’ని ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేశ్‌ మంగళవారం కోనసీమలో పర్యటించనున్నారు. అమలాపురంలో జీఎంసీ బాలయోగి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రావులపాలెం మీదుగా భారీ ర్యాలీగా కొత్తపేట, పలివెల, ముక్కామల, అంబాజీపేట, బండారులంక మీదుగా ఆయన అమలాపురం చేరుకుంటారు. నల్లవంతెన వద్ద ఉన్న బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. అనంతరం మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పుట్టినరోజు వేడుకల్లో లోకేశ్ పాల్గొంటారు. బాలయోగి నేపథ్యం ఇదీ.. జీఎంసీ బాలయోగి 1945 అక్టోబర్ 1న కోనసీమ ప్రాంతంలో దళిత రైతు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ, లా చదివారు. 1991లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996-98 మధ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 1998 మార్చి 24న లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఉండగానే 2002, మార్చి 3న భీమవరం నుండి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం కారణంగా కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం సమీపంలో ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కొబ్బరి చెట్టుకు తగిలి చేపల చెరువులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు.


By October 01, 2019 at 09:10AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-chief-chandrababu-naidu-and-nara-lokesh-tributes-to-former-ls-speaker-gmc-balayogi-on-his-birth-anniversary/articleshow/71385171.cms

No comments