Breaking News

Charan.. నువ్వు లేకుండా సాధించగలనా: ఉపాసన


బిజినెస్ వుమెన్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణిగా కామినేనికి సమాజంలో ఎంతో పేరుంది. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి మనవరాలైన ఉపాసన.. సమాజం కోసం తన వంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అపోలో పేరిట పేద పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందిస్తుంటారు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కు, అభిమానులకు ఫిట్‌నెస్ విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో, వాటి వల్ల ప్రయోజనాలేంటో అన్నీ వీడియోల ద్వారా చెబుతుంటారు. కేవలం చెప్పడం వరకే కాదు.. ఆమె కూడా ఫాలో అవుతూ రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తుంటారు. ఈ రకంగానైనా తన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని ఉపాసన నమ్ముతారు. వేల కోట్ల ఆస్తికి వారసురాలైనా, మెగా కుటుంబానికి కోడలైనా ఆమెలో ఆ గర్వం ఇసుమంతైనా ఉండదు. వ్యాపార విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. అందుకే ఉపాసనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ క్యాటగిరీలో మహాత్మా గాంధీ అవార్డు వరించింది. ఈ విషయాన్ని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. తనకు సహకరించినందుకు సమాజానికి, కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చరణ్ తన సతీమణిని చూసి గర్వపడిపోతున్నారు. ‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు చేస్తున్న గొప్ప పనికి ఇలాగే మరెన్నో అవార్డులు అందుకోవాలి’ అంటూ ఆమెకు విషెస్ తెలిపారు. ఇందుకు ఉపాసన ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది. ‘థ్యాంక్స్ మిస్టర్.సి. నీ ప్రేమ, సపోర్ట్ లేకుండా ఇవి సాధించేదాన్ని కాదు’ అని రిప్లై ఇచ్చారు. ఉపాసన తన భర్తను ముద్దుగా మిస్టర్ సి అని పిలుస్తుంది. చరణ్ తన భార్యను ఉప్సీ అని పిలుస్తుంటాడు. అపోలో సంస్థలకు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు ఉపాసన తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తన భర్తకు సంబంధించిన సినిమాలను కూడా ప్రమోట్ చేస్తుంటారు. ఓ కూతురిగా, భార్యగా, కోడలిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాసన చేస్తున్న సామాజిక సేవకు ఇలాంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2012లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం.


By October 05, 2019 at 12:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-kamineni-wins-mahatma-gandhi-award-husband-ram-charan-has-a-sweet-message-for-her/articleshow/71452532.cms

No comments