KCR సర్కారుపై దుమ్మెత్తిపోసే నేత.. హరీశ్‌పై పొగడ్తలు, అరగంట భేటీ!
హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్ రావును మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి కలిశారు. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ లాబీలో హరీశ్‌ను కలిసిన రాజగోపాల్ అరగంట సేపు చర్చలు జరిపారు. ఈ భేటీలో రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాజగోపాల్ రెడ్డి, హరీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో.. కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు.. ఇంతకూ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక ప్రదేశమా? లేదంటే సాగునీటి ప్రాజెక్టా? చెప్పండని ఆయన మంత్రిని నిలదీశారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేయడమే తన లక్ష్యమని పదే పదే చెప్పే రాజగోపాల్.. ఆయన మేనల్లుడు హరీశ్ రావుతో అర గంట సేపు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. పని రాక్షసుడు, ఇరిగేషన్ మినిస్టర్‌గా గత ఐదేళ్లు రాత్రింబవళ్లు ఆయన శ్రమించారని రాజగోపాల్ అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు గుప్పించారు. 90 శాతం పనులు పూర్తయిన ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని రాజగోపాల్ ఆరోపించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. కేసీఆర్‌ను ఓడించడం బీజేపీ వల్లే సాధ్యమన్న ఆయన.. సోమవారం మాట మార్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కేసీఆర్ సర్కారుతో ఢీ అంటే ఢీ అనే ఆయన.. హరీశ్ రావుతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన టీఆర్ఎస్‌లో చేరతారా? అనే ప్రశ్న తలెత్తింది. టీఆర్ఎస్ కీలక నేతతో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ.. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి రాజగోపాల్ రెడ్డి చర్చించారని తెలిపాయి. కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందట.
By September 18, 2019 at 08:41AM
No comments