Breaking News

విస్మయం గొలుపుతున్న జగన్ నిర్ణయం.. టీటీడీలో చంద్రబాబు బినామీ!


పాలకమండలిలో 24 మంది కొత్త సభ్యులను నియమించిన జగన్ సర్కారు.. ఏడుగుర్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కరు మాత్రమే ఏపీకి చెందినవారు. ఢిల్లీకి చెందిన రాకేశ్ సిన్హా, చెన్నైకి చెందిన ఏజే శేఖర్‌ రెడ్డి, బెంగళూరుకు చెందిన ఉపేందర్‌ రెడ్డి, హైదరాబాద్ నుంచి గోవింద హరి, భువనేశ్వర్‌కి చెందిన దుశ్మంత్‌ కుమార్‌ దాస్‌, ముంబైకి చెందిన అమోల్‌ కాలేలను నియమించినట్లు పేర్కొంది. వీరంతా ఆయా నగరాల లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులు కావడం గమనార్హం. ప్రత్యేక ఆహ్వానితులు టీటీడీ బోర్డు సమావేశాలకు హాజరవుతారు. వారికి బోర్డు సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది. కానీ టీటీడీ పాలకమండలి తీర్మానాల విషయంలో వారికి ఎలాంటి ఓటు హక్కులు ఉండవు. కాగా చెన్నైకి చెందిన ఏజే నియామకం వివాదాస్పదం అవుతోంది. టీటీడీ పాలకమండలిలో శేఖర్‌ రెడ్డికి అవకాశం దక్కడం ఇది రెండోసారి. గత ప్రభుత్వ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు శేఖర్‌ రెడ్డి పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. 2016లో చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ శాఖ దాడులు చేయగా.. భారీగా నగదు బయటపడింది. ఆయనపై ఐటీ శాఖతో పాటు సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాయి. ఈ పరిణామాలతో శేఖర్‌ రెడ్డి టీటీడీ సభ్యత్వాన్ని కోల్పోయారు. శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. లోకేశ్‌కి డబ్బులు ఇచ్చి ఆయన టీటీడీ మెంబర్ అయ్యారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. కానీ శేఖర్ రెడ్డి వ్యవహారం తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించింది కానీ మాకు సంబంధం లేదని చంద్రబాబు వివరణ ఇచ్చారు. శేఖర్ రెడ్డిని టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా జగన్ సర్కారు నియమించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అని విమర్శించిన జగన్.. ఇప్పుడు ఆయనకు పాలక మండలిలో అవకాశం ఎలా కల్పించారని ప్రశ్నిస్తున్నారు. పాత పేపర్ క్లిప్పింగులు, ట్వీట్ల స్క్రీన్ షాట్లతో జగన్ సర్కారును ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


By September 20, 2019 at 09:00AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/sekhar-reddy-among-seven-ttd-board-special-invitees-tdp-trolls-ysrcp/articleshow/71211884.cms

No comments